
2,63,535 మంది అభ్యర్థులు హాజరు-
రాజస్థాన్‌లోని జైపుర్‌లో
రెండు కేంద్రాల్లో పరీక్ష వాయిదా
విద్యుత్ అంతరాయం కారణంగా నిలిచిన పరీక్ష
సెప్టెంబర్ 5న మ.3 గంటలకు తిరిగి పరీక్ష
మనతెలంగాణ/హైదరాబాద్ : నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్‌బిఇఎంఎస్) ఆధ్వర్యంలో నీట్ పిజి 2026 పరీక్ష దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు 2,73,096 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 2,63,535 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అయితే, రాజస్థాన్‌లోని జైపుర్‌లో రెండు పరీక్ష కేంద్రాల్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. విద్యుత్ అంతరాయంతో పరీక్షలు సజావుగా జరగలేదని, తిరిగి సెప్టెంబర్ 5న పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్‌బిఇఎంఎస్ వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం 3 గంటలకు రీ టెస్ట్‌ను నిర్వహించనున్నట్లు పేర్కొన్నాయి. పరీక్షా కేంద్రం, సవరించిన అడ్మిట్ కార్డులతో సహా తదుపరి వివరాలు విడిగా తెలియజేస్తామని ప్రకటించాయి. రీ షెడ్యూల్ చేసిన పరీక్ష కేంద్రాల్లో దాదాపు 2,445 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. తెలంగాణ, తమిళనాడు, ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, సహా పలు నగరాల్లోని విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 339 నగరాలలో 1,111 పనీక్షా కేంద్రాలలో నీట్ పిజి పరీక్ష నిర్వహించారు. సిసి కెమెరాల పర్యవేక్షణలో ఈ పరీక్షను నిర్వహించగా, ఢిల్లీలోని ఎన్‌బిఇఎంఎస్ కార్యాలయంలోని కమాండ్ సెంటర్ నుంచి ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. త్వరలోనే ఆన్సర్ కీని వెబ్‌సైట్‌లో విడుదల చేయనున్నట్లు బోర్డు తెలిపింది. ఈసారి నీట్ పిజి ప్రశ్నల సంఖ్యను 200 నుంచి 180కి తగ్గించగా, మొత్తం మార్కులు 720గా ఉన్నాయి. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు ఇవ్వనుండగా, తప్పు సమాధానానికి 1 మార్కు చొప్పున నెగెటివ్ మార్కింగ్ వర్తిస్తుంది. ఇక ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులకు ఒకే రకమైన మార్కులు వస్తే.. తప్పు సమాధానాలు తక్కువగా ఉన్నవారికి, ఎంబిబిఎస్ పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించినవారికి, వయసులో పెద్దవారికి టై- బ్రేకింగ్ నిబంధనల ప్రకారం మెరిట్‌లో ప్రాధాన్యత ఇస్తారు. రీ-ఎగ్జామ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఫలితాలతో పాటు తుది కటాఫ్ మార్కులను ఎన్‌బిఇఎంఎస్ విడుదల చేస్తుంది.
పరీక్షల నిర్వహణను పరిశీలించిన మంత్రి రాజనర్సింహ
రాష్ట్రంలో 14 జిల్లాల్లోని 56 పరీక్షా కేంద్రాల్లో నీట్ పిజి 2026 పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఈ పరీక్షకు మొత్తం 17,626 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 17,143 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 483 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 97.26 శాతం హాజరు నమోదైంది. అన్ని పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు సజావుగా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. గచ్చిబౌలిలోని టిసిఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రీజనల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లైవ్ మానిటరింగ్ యూనిట్‌ను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సందర్శించారు. పరీక్షా కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ తీరును మంత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు.











