
మహిళా సాధికారతకు ఆధునిక మహిళా శక్తి భవనాలు
22 జిల్లాల్లో రూపుదిద్దుకుంటున్న భవన నిర్మాణ పనులు
త్వరలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం
ఏర్పాట్లు చేస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రతి ఇందిరా మహిళా శక్తి భవనంలో ‘వన్ స్టాప్ ఫెసిలిటీ సెంటర్’ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా పారిశ్రామికవేత్తలకు వ్యాపార సలహాలు, ప్రాజెక్టు నివేదికల తయారీ, రిజిస్ట్రేషన్, లైసెన్సులు, నైపుణ్యాభివృద్ధి, బ్యాంకు రుణాల అనుసంధానం, మార్కెట్ లింకేజీ, బ్రాండింగ్, ప్యాకేజింగ్, ఈ- కామర్స్, ప్రభుత్వ పథకాలతో అనుసంధానం వంటి సేవలను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకురానుంది. ఈ దిశగా మహిళా శక్తి భవనాలను వేదికలుగా చేసుకుని మహిళా సాధికారితకు తోడ్పాటును అందించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వ్యాపారం ప్రారంభించాలనుకునే మహిళలకు ఆలోచన నుంచి కార్యరూపం దాల్చే వరకు అవసరమైన మార్గదర్శకత్వం, చేయూత అందించేలా ఈ కేంద్రాలు పనిచేయనున్నాయి. దీంతో మహిళా సంఘాల సభ్యులకు వివిధ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం తగ్గడంతో పాటు, తమ ఉత్పత్తులను వ్యాపార అవకాశాలుగా మార్చుకునేందుకు అవసరమైన సహకారం ఒకే చోట లభిస్తుంది.
రూ.110 కోట్లతో 22 జిల్లాల్లో నిర్మాణం
రాష్ట్ర వ్యాప్తంగా 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఒక్కో భవనం సుమారు 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మానం జరుగుతోంది. మొత్తం ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.110 కోట్లు కాగా సెర్ప్ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం చేపట్టిన నిర్మాణ పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా మహిళా శక్తి భవనాలను ప్రారంభించేందుకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ పనులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆయా జిల్లాల జిల్లా సమాఖ్యలు వీటిని సొంతంగా నిర్వహించుకునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహిళా సంఘాల కార్యకలాపాలకు అనుగుణంగా భవనాల వినియోగం, నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నారు. ప్రతి ఇందిరా మహిళా శక్తి భవనంలో మహిళా సంఘాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని విస్తృతమైన సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. 100 మంది సామర్థ్యంతో జనరల్ బాడీ సమావేశ మందిరం, 50 మంది సామర్థ్యంతో శిక్షణా మందిరం, రిసెప్షన్, వెయిటింగ్ ఏరియా, కార్యాలయాలు, సిబ్బంది గదులు, ఉత్పత్తుల ప్రదర్శన ప్రాంతం, స్టోర్, కిచెన్, ఇండోర్, అవుట్‌డోర్ డైనింగ్ సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. అలాగే మహిళలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు వసతి గదులు, డార్మిటరీలను ఏర్పాటు చేస్తున్నారు. సమావేశాలు, సాంస్కృతిక, అవగాహన కార్యక్రమాల కోసం 200 మంది వరకు సామర్థ్యంతో ఓపెన్ ఎయిర్ థియేటర్‌ను కూడా నిర్మిస్తున్నారు. దివ్యాంగులకు అనుకూలంగా ర్యాంపులు, ప్రత్యేక టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నారు. సెర్ప్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఈ భవనాలు భవిష్యత్‌లో మహిళా సంఘాల ఆర్థిక కార్యకలాపాలకు కీలక కేంద్రాలుగా మారనున్నాయి.
గ్రామ స్థాయిలోనూ మహిళలకు సొంత వేదికలు
జిల్లా స్థాయిలో ఇందిరా మహిళా శక్తి భవనాలతో పాటు గ్రామ స్థాయిలోనూ మహిళా సంఘాలకు సొంత వేదికలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మహిళా సంఘాల కార్యకలాపాలకు అవసరమైన మౌలిక వసతులను బలోపేతం చేస్తూ, గ్రామం నుంచి








