
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురంలో అభిమాని ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. అమలాపురం మండలం బెండమూర్లంక గ్రామానికి చెందిన రోళ్ల ప్రేమ్ కుమార్ (25) హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు తన స్నేహితులతో కలిసి స్వగ్రామానికి వెళ్లాడు. ఈ క్రమంలో అమలాపురంలోని ఒక కళాశాల సమీపంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు బ్యానర్ ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ వైరు తగిలి కరెంట్ షాక్‌కు గురయ్యాడు. విద్యుత్ ప్రసారం ఎక్కువగా ఉండటంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ అకస్మాత్తు సంఘటన స్థానికంగాను, పవన్ కళ్యాణ్ అభిమానుల్లోనూ తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమ్ కుమార్ కుటుంబానికి అండగా ఉంటాం..!
విద్యుత్ షాక్‌తో జన సైనికుడు రోళ్ల ప్రేమ్ కుమార్ ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందని జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రేమ్ కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ప్రకటించారు. అతడి కుటుంబానికి అండగా నిలబడతానని పవన్ పేర్కొన్నారు. జీవితం ఎంతో అమూల్యమైనది.. వేడుకలు, ఉత్సవాల సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే సమయంలో మన కోసం కుటుంబం ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని.. ఎత్తైన ప్రదేశాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసే సమయంలో, ర్యాలీల్లో స్వీయ భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అందరూ అప్రమత్తంగా వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఈ దుర్ఘటనపై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అభిమాని మరణం తనకెంతో ఆవేదన కలిగించిందన్నారు. మృతి చెందిన ప్రేమ్ కుమార్











