
మన తెలంగాణ/వికారాబాద్ బ్యూరో/దౌల్తాబాద్: ఉపాధ్యాయులు రోడ్డెక్కొద్దని, వారి సమస్యలను పరిష్కరించేందుకు తనకు రెండేళ్లు సమయం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోరారు. ఆర్థిక వెసులుబాటును బట్టి ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రాజకీయ నాయకుల ఉచ్చులో పడకుండా ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. శనివారం వికారాబాద్ జిల్లా కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన 123 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేశారు.
55 రోజుల్లో 10,006 పోస్టులు భర్తీ
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 55 రోజుల్లో డీఎస్సీ ద్వారా 10,006 ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేశామని సీఎం తెలిపారు. ఒక్క ఫిర్యాదు లేకుండా 25,950 మంది ఉపాధ్యాయుల ప్రమోషన్లు, ఎలాంటి వివాదాలకు తావులేకుండా 34,706 మంది ఉపాధ్యాయుల బదిలీలు పూర్తిచేశామని పేర్కొన్నారు. భార్య ఒకచోట.. భర్త మరోచోట పనిచేస్తున్న సమస్యను 317 జీవో ద్వారా పరిష్కరించామని చెప్పారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి విద్యా కమిషన్ ఏర్పాటు చేశామని తెలిపారు.
విద్యాభివృద్ధిలో 28 నుంచి 17వ స్థానానికి...
విద్యాభివృద్ధిలో తెలంగాణ గతంలో 28వ స్థానంలో ఉండగా.. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 17వ స్థానానికి చేరిందని రేవంత్రెడ్డి తెలిపారు. ఇది ఉపాధ్యాయుల కృషితోనే సాధ్యమైందని కొనియాడారు. ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతుండగా.. తెలంగాణలో రెండేళ్లలో 88 వేల మంది విద్యార్థులు పెరిగారని చెప్పారు.
రెండేళ్ల తర్వాత మార్కులు వేయండి
మీ ఉద్యోగ సర్వీసు 30 ఏళ్లు. మా సర్వీసు ఐదేళ్లు. మే ము ప్రతి ఐదేళ్లకోసారి పరీక్ష రాయాల్సి ఉంటుందని సీఎం వ్యాఖ్యానించారు. రెండేళ్ల తర్వాత ఉపాధ్యాయులు ఆశించినవిధంగా సమస్యలు పరిష్కరించకపోతే ఎన్నికల పరీక్షలో తమకు ఎన్ని మార్కులు వేయాలో వారే నిర్ణయించుకోవాలన్నారు. గత పదేళ్లలో విద్యావ్యవస్థ విధ్వంసమైందని, దానిని తిరిగి వికాసం వైపు నడిపిద్దామని పి లుపునిచ్చారు. ఉపాధ్యాయులకు ఎలాంటి చిన్న సమస్య రాకుం డా చూసుకునే బాధ్యత తనదేనని భరోసా ఇచ్చారు.
విద్యార్థులను దేశానికి దిక్సూచిగా తీర్చిదిద్దాలి
తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపేలా విద్యార్థుల ను తీర్చిదిద్దాలని సీఎం ఉపాధ్యాయులను కోరారు. ప్రభు త్వ పాఠశాలల్లో చదివే పేద, బడుగు, బలహీనవర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించి దేశాభివృద్ధికి దిక్సూచిగా నిలిచేలా చేయాలన్నారు.12వ తరగతి వర కు జ్ఞానం, భావ వ్యక్తీకరణ.. ఆ తర్వాత నైపుణ్యాలను పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో 95శాతం అడ్మిషన్లు జరిగాయని, ఐటీఐ విద్యా వ్యవస్థను ఏటీసీగా, పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీలుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.








