
అస్సాం ముఖ్యమంత్రిగా వరుసగా రెండో సారి హిమంత బిశ్వ శర్మ మంగళవారంనాడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఖనపరలోని వెటర్నరీ కాలేజీ మైదానంలో అట్టహాసంగా ఏర్పాట్లు శారు. ఉదయం 11.40గంటలకు జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రలు, బిజెపి పాలిత రాష్ట్రాల సిఎంలు, ఎన్‌డిఎ నేతలు హాజరుకానున్నారు. గత ఆదివారంనాడు గవర్నర్ ఎల్‌పి ఆచార్య, హిమంత బిశ్వశర్మను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. 2021 ఎన్నికల్లో ఘన విజయం తర్వాత శర్మ తొలిసారి ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు. ఇటీవలి ఎన్నికల్లో ఆయన నేతృత్వంలో అస్సాంలో పార్టీ తిరిగి అఖండ విజయం సాధించింది. తద్వారా బిజెపి హ్యాట్రిక్ విజయం నమోదు చేసుకుంది. ఈ నేపథ్యంలో బిజెపి శాసనసభా పక్ష నేతగా ఇటీవల హిమంతను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 126 మంది సభ్యులున్న అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో 102 సీట్లను ఎన్‌డిఎ గెలుచుకుంది. వీటిలో బిజెపి సొంతంగా 82 గెలుచుకోగా, మిత్రపక్షాలైన ఏజీపీ, బిపిఎఫ్ 10 స్థానాల్లో విజయం సాధించాయి.














