
మన తెలంగాణ/హైదరాబాద్/సంగారెడ్డి బ్యూ రో: రేషన్ కార్డు కేవలం ఒక కాగితం కాదనీ, ఇ ది పేదల ఆకలి తీర్చే ఆత్మగౌరవమని సిఎం రే వంత్‌రెడ్డి పేర్కొన్నారు. పేదలకు నిత్యావసరాల ను పంపిణీ చేసేందుకు రేషన్ షాపులను తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఆయన తెలిపా రు. ఇందిరమ్మ రాజ్యంలో ఏ ఒక్క పేదవాడు ఆకలితో అలమటించకూడదన్నదే ప్రజా ప్రభు త్వ ఆలోచన అని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నా రు. కాంగ్రెస్ పాలనలో రైతే రాజయ్యాడని.. అప్పులు లేని రైతులు తెలంగాణలోనే ఉన్నారని కేంద్రమే చెప్పిందని, రాష్ట్రంలోని అర్హులందరికీ పింఛన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. సన్న బి య్యం గురించి ఒకరు, ఇందిరమ్మ ఇళ్ల గు రించి ఇంకొకరు ఆరోగ్యశ్రీ గురించి మరొకరు మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం సంగారెడ్డి పట్టణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభలో ప్రజల సమక్షంలో స్మార్ట్ రే షన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సిఎం రేవంత్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షత వహించారు. అంతకుముందు సీఎం కంది ఐఐటీ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ వద్ద నుంచి కాన్వాయ్‌లో స్థానిక ఐబీ వద్ద ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణ కార్యక్రమానికి చేరుకున్నారు. మాజీ ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ, రాజీవ్‌గాంధీ విగ్రహాలను సీఎంతో పాటు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వివేక్, దామోదర రాజనర్సింహ, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ఆవిష్కరించారు. అనంతరం అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటుచేసిన సభా ప్రాంగణానికి చేరుకుని సీఎం ప్రసంగించారు. ప్రభుత్వంలోని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఆరు నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వంలోని ప్రతి ఖాళీని భర్తీ చేయాలన్న కల్పంతో పనిచేస్తున్నామని, నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని ఆయన సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 3.42 కోట్ల మందికి సన్నబియ్యం
పేదవారు ఆకలిలో అలమటించరాదని, ఎవరి ముందు చేయి చాచి నిలబడాల్సిన అవసరం లేదన్న సంకల్పంతోనే దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయనప్పటికీ తెలంగాణలో సన్నబియ్యం పంపిణీ చేపట్టామని సిఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. దేశంలో రేషన్ షాపుల వ్యవస్థను ప్రారంభించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని సిఎం పేర్కొన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 3.42 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని సిఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. నిరుపేదలకు సన్నబియ్యం పంపిణీ ప్రారంభించిన తర్వాత మార్కెట్లో వాటి ధర రూ.10 నుంచి రూ.15లు తగ్గిందన్నారు. వ్యవసాయం దండగ కాదు, పండుగ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 1.70 లక్షల కోట్ల రూపాయలు వ్యవసాయ రంగంపై ఖర్చు చేశామని సిఎం చెప్పారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాం
గడిచిన 32 నెలల కాలంలో రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం రూ. 90 వేల కోట్లు చెల్లించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రూ. 21 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేసి 25 లక్షల మంది రైతులను అప్పుల నుంచి విముక్తి చేశామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దేశంలోనే అతితక్కువ అప్పులున్నది తెలంగాణ రైతాంగం అని కేంద్ర ప్రభుత్వ నివేదికలు వెల్లడించాయన్నారు. రైతు భరోసా ఎకరాకు 12 వేలు పెంచి రూ. 36 వేల కోట్లు రైతు భరోసా కింద అందించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈనాడు రైతులు ఆనందంగా వ్యవసాయం చేసుకుంటున్నారని, వ్యవసాయాన్ని పండుగ చేశామని, రైతులను రాజులా గౌరవించే సంస్కృతి తమ ప్రభుత్వానిదని సిఎం అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటేనే మహిళా ప్రభుత్వం. కోటి మంది కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీకే రూ. 60 వేల కోట్ల మేర బ్యాంకు లింకేజీ ఇచ్చామని ఆయన అన్నారు.
వ్యాధుల బారిన పడిన వారికి పెన్షన్
మహిళలకు ఆర్టీసిలో ఉచిత ప్రయాణం కోసం రూ. 11 వేల కోట్లు చెల్లించామని, రాష్ట్రంలో 27 లక్షల మంది బడిపిల్లలకు అవసరమైన స్కూల్ డ్రెస్సులు కుట్టించే పనిని మహిళా సంఘాలకే అప్పగించామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తొలి విడతలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మహిళలకు కేటాయించామని, రెండో విడతలో మరో 2.5 లక్షల ఇళ్లను కేటాయించామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో వితంతువులు, ఒంటరి మహిళలు అందరికీ పెన్షన్ ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదని ఆయన అన్నారు. అలాగే, చేనేత కార్మికులు, గీత కార్మికులు, సికిల్ సెల్ అనీమియా వంటి వ్యాధుల బారిన పడిన వారికి పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించినట్టు సిఎం ప్రకటించారు. అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
నిరుద్యోగ యువకులను రెచ్చగొట్టాలని
కొందరు నిరుద్యోగ యువకులను రెచ్చగొట్టాలని చూస్తున్నారని, ఉన్నవీ లేనివీ చెప్పే వారి మాయలో పడొద్దని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అధికారం చేపట్టిన ఏడాది కాలంలోనే 70 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, ఈ మధ్య కాలంలో మరో 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశామని, ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత తమదని ఆయన అన్నారు. ఏ ఖాళీలను గాలికి వదిలేయమని, పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అన్ని పరీక్షలు నిర్వహించే బాధ్యత తనదని ఆయన తెలిపారు. గత ప్రభుత్వంలో చేసిన అప్పులు, తప్పులకు వడ్డీ కడుతూ విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సంక్షోభంలో ఉన్న సంక్షేమాన్ని గాడిలో పెట్టి అమలు చేస్తున్నామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రజలకు కావాల్సిన మంచి పరిపాలన అందించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని, అందుకు ప్రజల ఆశీర్వాదం ఉండాలని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రజల ఆశీర్వాదముంటే సాధించలేనిది ఏదీ లేదని, మీకు ఇచ్చిన ప్రతిమాట నిలబెట్టుకుంటామని ముఖ్యమంత్రి భరోసానిచ్చారు.
రూ.100 కోట్లు ఖర్చు పెట్టినా జగ్గారెడ్డి లాంటి నాయకులు దొరకరు
సంగారెడ్డిలో జగ్గారెడ్డి పోటీ చేయాలో వద్దో అనేది ఆయన చేతిలో కూడా లేదని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అది రాహుల్ గాంధీ చేతిలోనే ఉందని, రాహుల్ గాంధీ రాముడు అయితే జగ్గన్న హనుమంతుడి లాంటి వాడని సిఎం అన్నారు. ఆ రాముడి మాట ఈ హనుమంతుడు ఎప్పుడూ జవదాటడని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. రూ.100 కోట్లు ఖర్చు పెట్టినా జగ్గారెడ్డి లాంటి నాయకులు దొరకరని ఎన్నికల్లో ఓడినా కుటుంబాన్ని కూడా వదిలి ప్రజలతోనే ఉంటున్నారని సిఎం కితాబునిచ్చారు. తెలంగాణలో జగ్గారెడ్డి లాంటి నాయకుడు లేరని, అలాంటి నాయకులు ప్రజా జీవితంలో ఉండాలని, ఆయనకు మీరు అండగా ఉండాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు.
బిఆర్‌ఎస్ నేతల క్షుద్రపూజలు
ఇందిరమ్మ రాజ్యంలో కరువు కాటకాలు ఏర్పడాలని, వర్షాలు కురవొద్దని, తమ ప్రభుత్వం కూలిపోవాలని కోరుకుంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు, బీఆర్‌ఎస్ నేతలు పక్క రాష్ట్రాల్లో క్షుద్రపూజలు, చేతబడి చేయిస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఘాటుగా ఆరోపించారు. ఆలయాల్లో పూజలు చేస్తే సోషల్ మీడియాలో హల్‌చల్ చేసే హరీశ్‌రావు.. ఈ పూజల గురించి ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారని ప్రశ్నించారు. మరోవైపు బావమరిది మాత్రం.. తమ బావ కేసీఆర్‌పై చేతబడి చేశారని తెలిసినవాళ్లతో చెప్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ ఫయీమ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత కిషన్, సెట్విన్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, ఉజ్వల్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి, అదనపు కలెక్టర్ పాండు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.








