దేశంలో ఎక్కడైనా ఫుట్‌పాత్‌ల రక్షణ అత్యంత కీలకం అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిర్ధేశిత ఫుట్‌పాత్‌లపై సామాన్య పాదచారులు జంకూగొంకూ లేకుండా, రోడ్లపై సాగే వాహనాల భయాలు లేకుండా సాగాల్సి ఉంటుంది. కాలిబాట నడక ఇది సగటు జనం ప్రాధమిక హక్కు , ఈ హక్కును పరిరక్షించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వాలపై ఉందని న్యాయమూర్తులు పిఎస్ నరసింహ, ఎఎస్ చంద్రూర్కర్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం రూలింగ్ వెలువరించింది. ఈ క్రమంలోనే పౌరుల ఫుట్‌పాత్ నడక హక్కును కాపాడేందుకు అవసరం అయిన నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉందని ఆదేశించింది. అసలు కాలినడకలు ఉన్నాయా? ఉంటే అవి ఏ పరిస్థితిలో ఉన్నాయి? వాహనాలు వీటిపై వెళ్లుతున్నాయా? లేక ఇవి కూడా వ్యాపార అవసరాలకు కబ్జా అవుతున్నాయా? అనేది గుర్తించి , వాటి రక్షణకు చర్యలు తీసుకోవల్సి ఉంటుంది.

ఇందుకు స్థానికంగా కార్పొరేషన్‌లు, మున్సిపాల్టీలు, గ్రామ పంచాయతీల స్థాయిల్లో సరైన ఏర్పాట్లుకు దిగాల్సి ఉందని తెలిపారు. ఫుట్‌పాత్‌లు లేక ప్రమాదాలకు గురి అయితే బాధితుల పరిస్థితి ఏమిటని నిలదీశారు. వారికి యంత్రాల వాహనాలతో పోలిస్తే ప్రాణమున్న వ్యక్తుల కదలికలు కీలకం. ప్రజలు స్వేచ్ఛగా ఇబ్బంది లేకుండా ఫుట్‌పాత్‌లపై వెళ్లేందుకు వీలు కల్పించాల్సి ఉంది. ఇందుకు ప్రత్యేకంగా ఒక పరిరక్షక వ్యవస్థ ఏర్పాటు కావాలని తెలిపారు. ఓ తండ్రి తన ఐదేండ్ల కుమారుడిని తీసుకువెళ్లుతుండగా వాహనం వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో కొడుకు చనిపోయాడు. దీనిపై బాధిత తండ్రి పరిహారం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మానవీయ ఘటన సంబంధిత వ్యాజ్యం విచారణ దశలో పూర్వాపరాల ఆరా తరువాత ధర్మాసనం స్పందించింది. తన తీర్పు క్రమంలో మానవీయ కోణం ప్రదర్శించింది.పౌరుల ప్రాధమిక హక్కులో భాగంగా ఫుట్‌పాత్‌లపై వెళ్లుతున్నప్పుడు అవసరం అయిన రక్షణా భద్రతా చట్రం లేకపోవడం శోచనీయం అని ధర్మాసనం స్పందించింది.

రోడ్లపై కేవలం వాహనాలే కాదు మనుష్యులూ కదులుతారు. వీరి ఉనికి, వీరి భద్రత వాహనదార్లతో పోలిస్తే మరింత ఎక్కువగా ఉంటుందని తేల్చిచెప్పారు. ఒక సక్రమ చట్టబద్ధమైన సాధికారిక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఫుట్‌పాత్‌ల భద్రతకు చర్యలు తీసుకోవాలి. అవాంఛనీయ దుర్ఘటనలు జరిగితే తీసుకునే చర్యలు ఖరారు అయి ఉండాలని తెలిపారు. మోటారు వాహనాల చట్టాల పరిధిలో పొందే క్లెయిమ్స్‌కు భిన్నంగా ఫుట్‌పాత్ భద్రతల వ్యవస్థలోని నిబంధనలు ఖరారు అయి ఉండాలని తెలిపారు. సంబంధిత చట్టం లేదా వ్యవస్థల ఏర్పాటు బాధ్యత ప్రాధమిక హక్కుల రక్షణ బాధ్యతల్లో ఉండే ప్రభుత్వాలపై ఉంటుందని స్పష్టం చేశారు. ఫుట్‌పాత్‌పై సగటు మనిషి నడక , సాఫీగా సాగేలా చేయడం ప్రాధమిక హక్కుల పరిధిలోకి వస్తుంది. దీనిని తగు విధంగా పరిరక్షించాల్సిన బాధ్యత అందరిదీ, ప్రత్యేకించి ప్రభుత్వానిది అని సుప్రీంకోర్టు తెలిపింది.