
మన తెలంగాణ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా సైబర్ నేరా ల నియంత్రణ, దర్యాప్తు, బాధితులకు సేవలందించడం లో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయెల్ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రధానమంత్రి కార్యాలయం (పిఎం ఒ) గురువారం నిర్వహించిన ‘ప్రగతి’ జాతీయ స్థాయి స మీక్ష సమావేశంలో సైబర్ నేరాల పనితీరుకు సంబంధించిన తొమ్మిది కీలక ప్రమాణాల్లో తెలంగాణకు దేశంలోనే మొత్తం మొదటి ర్యాంకు లభించిందన్నారు. సైబర్ నేరాల నిరోధక చర్యలు, ఈ-జీరో ఎఫ్‌ఐఆర్ అమలు, డిజిటల్ వేదికల సమర్థ వినియోగం, బాధితులకు నిధుల రీఫండ్, ప్రజా అవగాహన కార్యక్రమాలు వంటి అంశాలను కేంద్ర హోంశాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సి) రూపొందించిన ప్రమాణాల ఆధారంగా సమీక్ష నిర్వహించారని, ఇందులో తెలంగాణ పనితీరును పిఎంఒ ప్రత్యేకంగా అభినందించిందని ఆమె తెలియజేశా రు.
సైబర్ సెక్యూరిటీ బ్యూరో రాష్ట్రంలో దేశంలోనే తొలి ఎస్4సి కేంద్రం ఏర్పాటు చేయడంతో పాటు ఈ-జీరో ఎఫ్‌ఐఆర్ అమలులోనూ ముందంజలో నిలిచిందని, అలాగే సమన్వయ పోర్టల్, సహయోగ్ పోర్టల్, గ్రీవెన్స్ రెడ్రెస్సల్ మెకానిజం (జిఆర్‌ఎం), మనీ రీస్టోరేషన్ మాడ్యూల్(ఎంఆర్‌ఎం) లను సమర్థవంతంగా వినియోగించి సైబర్ నేరాల దర్యాప్తు, బాధితులకు న్యాయం చేయడంలో మంచి ఫలితాలు సాధించిందన్నారు. బ్యాంకు ఖాతాల ఫ్రీజింగ్, అన్‌ఫ్రీజింగ్ వంటి సమస్యల పరిష్కారం కోసం రూపొందించిన జిఆర్‌ఎం పోర్టల్ ద్వారా ఈ నెల 2 నాటికి రాష్ట్రంలో 2,368 ఫిర్యాదులు నమోదు కాగా, వాటిలో 2,086 కేసులను పరిష్కరించి 88 శాతం విజయశాతం నమోదు చేసిందని వెల్లడించారు. ఎంఆర్‌ఎం ద్వారా రూ.16.42 కోట్ల మేర రీఫండ్ చేయాల్సిన మొత్తాన్ని గుర్తించారని, రూ.50 వేల లోపు నష్టాలకు ఎఫ్‌ఐఆర్ లేదా కోర్టు ఉత్తర్వులు లేకుండానే పరిహారం అందించే విధానం ఈ పోర్టల్ ప్రత్యేకతగా నిలిచిందని వివరించారు.
అక్రమ కంటెంట్ తొలగింపులో 89.41 శాతం
సహయోగ్ పోర్టల్ ద్వారా సోషల్ మీడియా తదితర వేదికల్లోని అక్రమ కంటెంట్ తొలగింపులో రాష్ట్రం మరోసారి ప్రతిభ చాటిందని, మొత్తం 2,447 యూఆర్‌ఎల్‌లలో 20,070 లింకులను తొలగించి లేదా యాక్సెస్ నిలిపివేయడంతో 89.41 శాతం విజయాన్ని నమోదు చేశామన్నారు. సమన్వయ పోర్టల్ ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 6,721 అభ్యర్థనల్లో 6,518 కేసులను పరిష్కరించి 96.68 శాతం పూర్తి చేశామని తెలిపారు. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు పంపిన 7,018 అభ్యర్థనల్లో 5,560 పూర్తయ్యాయని, సైబర్ నేరాలపై రాష్ట్రాల మధ్య సమాచార మార్పిడి, నిందితుల వివరాల విశ్లేషణ, ఉమ్మడి దర్యాప్తులో ఈ వేదిక కీలక పాత్ర పోషిస్తోందని తెలియజేశారు.
ప్రత్యేక హెల్ప్‌లైన్ అందుబాటులో
సైబర్ మోసాల బాధితులు జిఆర్‌ఎం, ఎంఆర్‌ఎం సేవలను వినియోగించుకునేందుకు రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రత్యేకంగా 8712665600 హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది. అలాగే ఈ సేవల వినియోగంపై అవగాహన కల్పించే వీడియోలను అధికారిక సోషల్ మీడియా వేదికల్లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌తో పాటు ఈ సేవలను విస్తృతంగా వినియోగించాలని డైరెక్టర్ శిఖా గోయెల్ విజ్ఞప్తి చేశారు.











