
ఖాట్మండూ: నేపాల్‌లో సంభవించిన మెరుపు వరదల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, లెక్కకు మిక్కిలిగా ప్రజల ఆచూకీ గల్లంతైంది. ఈ పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు సహాయక చర్యల్లో భాగమవుతాయని ముందుకు వస్తున్నాయి. అయితే నేపాల్ ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించుకునే సామర్థ్యం తమకు ఉందని తెలిపింది. నేపాల్ విదేశాంగ శాఖ ప్రతినిధి లోక్ బహదూర్ ఛెత్రి శుక్రవారంనాడు మాట్లాడుతూ, ఆపత్కాలంలో సహాయం కోసం ముందుకు రావడం సహజంగా జరిగేదేనని, అయితే తమ భద్రతా సంస్థలు గాలింపు, సహాయక చర్యలు చేపడుతున్నాయని చెప్పారు. ప్రస్తుతానికి తమకు సహాయం అవసరం లేదని చెప్పారు. నేపాల్‌కు సహాయం చేసేందుకు ముందుకు వచ్చిన దేశాల్లో భారత్, చైనా, అమెరికా, యూకే, జపాన్, దక్షిణ కొరియా, శ్రీలంక, బంగ్లాదేశ్ ఉన్నాయి.
ఎందుకు నిరాకరించిందంటే..
కాగా, రెస్క్యూ ఆపరేషన్లకు విదేశీ సాయాన్ని నేపాల్ తిరస్కరించడానికి కారణం ఏమటనే దానిపై పలు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 2015లో నేపాల్‌ను గోర్ఖా భూకంపం వణికించింది. తొమ్మిది వేల మందిగా పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ సమయంలో విదేశీ బృందాలు సహాయక చర్చల్లో పాల్గొన్నాయి. అయితే అంతమంది రావడంతో సమన్వయ సమస్యలు ఏర్పడి, సహాయక చర్యలు క్లిష్టంగా మారాయని, ఆ అనుభవంతోనే ఇప్పుడు విదేశీ సాయాన్ని నేపాల్ తిరస్కరించి ఉండవచ్చని చెబుతున్నారు.
కాగా, రెస్క్యూ ఆపరేషన్‌కు సాయం కోరకపోయినా యూఎస్, యూకే, ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ నుంచి ఆర్థిక సాయాన్ని నేపాల్ కోరుతోంది. ఆ నిధులను పీఎం రిలీఫ్ ఫండ్‌కు నేరుగా అందేలా చూడాలని నేపాల్ ప్రభుత్వం అన్ని రాయబార కార్యాలయాలకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది.








