మన తెలంగాణ/హైదరాబాద్: శ్రీనివాసమంగాపురంలోని శ్రీవారిమెట్టు మార్గంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌ వాసులకు గాయాలయ్యాయి. ఓ ప్రైవేటు కారు అదుపు తప్పి రోడ్డుపక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు చంద్రగిరి పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో కారు ముందు భాగం ధ్వంసంకాగా.. కారులో ఉన్న చింతల్‌కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి.

ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుపక్కలవాళ్లు గమనించి..గాయపడిన వారిని కారులోంచి బయటకు తీసి.. అంబులెన్సులో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారు శ్రీవారిమెట్టు మార్గం ద్వారా తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అక్కడి నుంచి చిత్తూరు జిల్లా కాణిపాకంలోని వినాయకుడి దర్శనం కోసం కారులో బయలుదేరగా.. ప్రమాదానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు.