ఢిల్లీ: భారత రాజ్యంగం ప్రకారం దళితులను అంటరానివారిగా చూడటం నేరమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. శుద్ధీకరణ పేరుతో చేసేవన్నీ అంటరానితనానికి మరో పేరు అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శుద్ధీకరణ చేసిన వారిపై కేసు నమోదు చేయాలని, శుద్ధీకరణ చేపట్టమంటే ఎస్సి,ఎస్టి చట్టాన్ని ఉల్లంఘించడమేనని సూచించారు. అన్నికులాలకు చెందిన వాడినని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పుకుంటారని, బిజెపి నేతలు మాత్రం శుద్ధీకరణ పాటిస్తారని రాహుల్ గాంధీ విమర్శించారు.

ఎఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆలయాన్ని సందర్శించిన తర్వాత బిజెపి నేతలు శుద్ధీకరణ చేశారని, శుద్ధీకరణ లాంటి కార్యక్రమాలు బిజెపి, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చేస్తారని మండిపడ్డారు. బిజెపి కొత్త సంస్థాగత నిర్మాణంపై తనకు ఆసక్తి లేదని, బిజెపికి కొత్త సంస్థ వచ్చినా, పాతదే కంటిన్యూ అయినా తేడా ఉండదని అన్నారు. కాంగ్రెస్ పోరాటం వ్యక్తులు, సంస్థాగత మార్పులపై కాదని, భారత రాజ్యాంగాన్ని కాపాడటం కోసమే తమ పోరాటమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇది ఖర్గే ఒక్కరి సమస్య కాదని, ప్రతీ దళితుడి సమస్య అని ఆవేదన వ్యక్తం చేశారు. ఖర్గేకు కాంగ్రెస్ నుంచి పెద్ద సపోర్ట్ లభించిందని, దేశంలో ప్రతీ దళితుడి తరపున తన పోరాటం కొనసాగుతుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.