
హైదరాబాద్: బిఆర్ఎస్ పదేండ్లలో ఇరిగేషన్ శాఖను సర్వనాశనం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. వాళ్ల వ్యక్తిగత లాభానికి ఇరిగేషన్ ప్రాజెక్టులను కట్టిందని అన్నారు. సచివాలయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తాను రెండున్నరేళ్లు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నానని, తెలంగాణ రైతుల కోసం ఇరిగేషన్ ప్రాజెక్టులు బిఆర్ఎస్ కట్టలేదని విమర్శించారు. పదేళ్లలో ప్రాజెక్టుల పేరిట రూ. 1.81 లక్షల కోట్లు ఖర్చు పెట్టారని, కాళేశ్వరం డిజైన్ చేసింది, కట్టింది, కూలింది..బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం పేరిట రూ. లక్ష కోట్లు నాశనం చేసి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారని, మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం పనికి రాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు బ్యారేజీల్లో నీళ్లు నిల్వ చేయొద్దని ఎన్డిఎస్ఎ చెప్పిందని, మూడు బ్యారేజీల ఫౌండేషన్ లో లోపాలు ఉన్నాయని నిపుణులు చెప్పారని తెలియజేశారు. నీళ్లు నిల్వ చేస్తే..మేడిగడ్డ కొట్టుకుపోయి..ఊర్లు, భద్రాచలం మునుగుతాయని, ఇంజనీర్లు చెప్పారని, బిఆర్ఎస్ నేతల కక్కుర్తి వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని ధ్వజమెత్తారు. ఎక్కువ కమీషన్ల కోసమే ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చారని, ఎక్కువ ఖర్చు పెడితే..ఎక్కువ కమీషన్లు వస్తాయని బిఆర్ఎస్ నేతలు కక్కుర్తి పడ్డారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు.










