రాష్ట్రంలో ప్రభుత్వం లేదని ఒక మాఫియా రాజ్యం నడుస్తుందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. అందినంత దోచుకో.. దొరికిన కాడికి దాచుకో అనే స్కీము నడుస్తుందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ దండుపాళ్యం బ్యాచ్‌కి రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రీగా ఉన్నారని, అందుకే అటు రేవంత్ రెడ్డితో పాటు ప్రతి ఒక్క మంత్రి కాంగ్రెస్ నాయకులు అందిన కాడికి దోచుకుంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు గుండాయిజాన్ని ప్రతి ఒక్కరు చూశారని అన్నారు. కాంగ్రెస్ కనుసన్నల్లోనే రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్‌లో 180 ఎకరాల ప్రభుత్వ సీలింగ్ భూమిని ప్రైవేట్ వారికి రాసిచ్చిన విషయాన్ని కెటిఆర్ గుర్తుచేశారు.

స్వయంగా ముఖ్యమంత్రే ప్రతి ఒక్కరినీ బెదిరిస్తూ మంత్రులు పారిశ్రామికవేత్తల తలలకు తుపాకులు పెడుతూ డబ్బులు ఇస్తారా చస్తారా అని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని విమర్శించారు. రెండున్నర సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలో ఒక్క ఇల్లు కూడా కట్టని కాంగ్రెస్ పార్టీ వేలాది ఇండ్లను కూల్చేందుకు మాత్రం సిద్ధమవుతున్నారని ఆరోపించారు. ఉన్న సిటీని వదిలిపెట్టి సిఎం తాను కబ్జా చేసిన వేలాది ఎకరాలను కాపాడుకోవడం కోసమే ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి తన భూములు చూసుకోవడానికే ఉనికిలో లేని ఫ్యూచర్ సిటీకి అప్పుడప్పుడు వెళ్లి వస్తున్నారని ఆరోపించారు.

రాజేంద్రనగర్ స్థానిక ఎంఎల్‌ఎ అభివృద్ధి పేరుతో పార్టీ మారారని.. కానీ, ఈ రెండున్నర సంవత్సరాలలో చేసిన ఒక్క అభివృద్ధి పని అయినా చెప్పగలరా..? అని కెటిఆర్ ప్రశ్నించారు. ఎంతమంది పెద్ద నేతలు పోయినా గులాబీ సైన్యం బలంగా అలాగే ఉన్నదని చెప్పారు. రానున్న ఎన్నికల్లో కెసిఆర్‌ని తిరిగి ముఖ్యమంత్రిగా తీసుకువచ్చి గులాబీ జెండాను ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కెటిఆర్ పార్టీ సభ్యత్వ నమోదుతో పాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్‌ఐఆర్ పైన కార్యకర్తలకు కెటిఆర్ దిశానిర్దేశం చేశారు.