
త్వరలో శ్రీవారి విద్యాసేవ, ఇంజనీరింగ్ సేవ, రక్షణ సేవలు
మన తెలంగాణ/హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం దశాబ్దాలుగా కేవలం వసతి, భోజన సేవలకే పరిమితమైన ‘శ్రీవారి సేవ’ పరిధిని విస్తరిస్తూ.. వృత్తి నిపుణులను కూడా భాగస్వామ్యం చేసేందుకు శ్రీకారం చుట్టింది. జూన్ 5న పైలట్ ప్రాజెక్టుగా ‘శ్రీవారి వైద్యసేవ’ను ప్రారంభించింది. స్విమ్స్, బర్డ్, పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి, సెంట్రల్ హాస్పిటల్, అశ్విని ఆసుపత్రి, ఆయుర్వేద ఆసుపత్రులు, గోశాలల్లో ఈ సేవలందించే అవకాశం కల్పించింది. ఇందులో స్పెషలిస్ట్ వైద్యులు కనీసం 3 రోజులు, ఎంబీబీఎస్ వైద్యులు 7 రోజుల సేవా స్లాట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వైద్యసేవ ప్రారంభమైన 83 రోజుల్లోనే 723 మంది వైద్యులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోగా, టీటీడీ 586 దరఖాస్తులను ఆమోదించింది.
ఇందులో భాగంగా ఇప్పటికే స్పెషలిస్టులు, ఎంబీబీఎస్, ఆయుర్వేద, పశువైద్యులు కలిపి 109 మంది వైద్యులు శ్రీవారికి సేవలు అందించారు. వైద్యుల సేవలను ప్రోత్సహించేందుకు టీటీడీ ప్రత్యేక దర్శనాలను కల్పిస్తోంది. మూడు రోజుల సేవ పూర్తి చేసిన స్పెషలిస్ట్ వైద్యులకు ఆలయ ఆధికారులు శ్రీవారి బ్రేక్ దర్శనం కల్పిస్తుండగా.. ఏడు రోజుల సేవ చేసిన ఎంబీబీఎస్ వైద్యులకు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఉచిత దర్శన అవకాశం కల్పిస్తున్నారు. శ్రీవారి వైద్యసేవ కోసం హిందూ మతానికి చెందిన ఆసక్తిగల వైద్యులు తమ సర్టిఫికెట్లు అప్లోడ్ చేసి, నచ్చిన ఆసుపత్రి, సేవా స్లాట్‌లు ఆన్‌లైన్‌లో ఎంపిక చేసుకోవాలి. టీటీడీ ఆమోదంతో విధుల్లో చేరి రోజుకు 6 గంటల పాటు సేవలందించాల్సి ఉంటుంది. వైద్య సేవలందిస్తున్న స్పందనతో భవిష్యత్తులో మరిన్ని రంగాలకూ దీన్ని విస్తరించాలని టీటీడీ భావిస్తోంది. త్వరలోనే శ్రీవారి విద్యాసేవ, ఇంజినీరింగ్ సేవ, రక్షణసేవలను కూడా ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.
తిరుమలలో భక్తుల రద్దీ&
శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. గత గురువారం మొదలయిన భక్తుల రద్దీ ఆదివారం కూడా కొనసాగుతుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు.
వరస సెలవు దినాలు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారని భావించి అవసరమైన ఏర్పాట్లను ముందుగానే చేశారు. వసతి గృహాల కోసం నిరీక్షణ తప్ప లేదు. అన్న ప్రసాదం క్యూ లైన్ లోనూ వేలాది మంది, అలాగే లడ్డూ విక్రయ కేంద్రాల వద్ద కూడా క్యూ కొనసాగింది. సోమవారం నుంచి భక్తుల తాకిడి కాస్త ఉపశమనంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.








