
అంతన్నారు ఇంతన్నారు, ఇప్పుడన్నారు అప్పుడన్నారు, నేడన్నారు రేపన్నారు. రెండున్నర సంవత్సరాలు మాత్రం రెప్పపాటులో గడిచిపోయాయి. అధికారంలోకి రాగానే పెండింగ్ డిఎలు విడుదల చేస్తాం. కానీ 30 నెలల తర్వాత కేవలం మూడు డిఎలు విడుదల చేయడానికి ముప్పుతిప్పలు పడ్డారు. ఆరు నెలల్లో కొత్త పిఆర్‌సి అమలు చేస్తాం ఇది కేవలం నినాదంగానే మిగిలింది. పిఆర్‌సి కమిటీ గడువును పొడిగిస్తూ కాలం గడుపుతున్నారు. 2023 జులై నుండి అమలు కావలసిన పిఆర్‌సికి మూడు ఏళ్లు విజయవంతంగా నిండాయి. ఇప్పటికి నివేదిక అందని ద్రాక్ష పండులాగానే ఉంది. ఇక దాని అమలు గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తాం, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తాం. ఈ వాగ్దానం ఊసే లేదు. ఇక పెన్షనర్ల బాధలు చెబితే భారతం అంత, రాస్తే రామాయణమంత. విరమణ చెంది రెండు సంవత్సరాలు గడిచినా రావలసిన బకాయిలు చేతికి అందకపోవడంతో వందకు పైగా గుండెలు ఆకస్మాత్తుగా ఆగిపోయాయి. ఎదురు చూసిన వారి కళ్ళు కాయలు కాసి పండ్లుగా మారగా చివరికి వారే రాలిపోయారు. వారి కుటుంబాలు ఛిద్రమైపోయాయి. వారి ఆశలు ఆవిరి కాగా, కలలు కల్లలు అయిపోయాయి.
సంఘాల ఒత్తిడి ప్రాతినిధ్యాల అనంతరం నెమ్మదిగా జిపిఎఫ్ సొమ్ము, మెడికల్ బిల్లులు విడుదలైనాయి నెలకు రూ. 500 కోట్లు విడుదల చేస్తామన్నారు, తర్వాత 600 కోట్లు అన్నారు. కానీ అందులో సింహభాగం కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులే జరిగినట్లు సమాచారం. ఏప్రిల్ 2024లో మొదలైన పదవీ విరమణలు నెలకు 800 నుండి 1000 దాకా జరుగుతుండగా వారికి చెల్లించాల్సిన బకాయిలు గుట్టల్లాగా పేరుకుపోయాయి. ఈ మధ్య ఉద్యోగ సంఘాల సమ్మె నోటీసు తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి 100 రోజుల్లో అంటే మూడు నెలల్లో 6000 కోట్లు అంటే నెలకు రెండు వేల కోట్లు విడుదల చేసి పెన్షనర్లకు గ్రాట్యుటీ, కమ్యూటేషన్ సొమ్ము చెల్లించుతామని ప్రకటించారు. ఇది కూడా ఇప్పటికీ కొంతమందికే అందినట్లు పెన్షనర్లు తమ అసంతృప్తిని వెళ్లబుచ్చుతున్నారు. నేటికీ ఇంకా ఆరు డిఎలు పెండింగ్ ఉండడంతో ప్రతి ఉద్యోగికి నెలకు సగటున పదివేల రూపాయల నష్టం వాటిల్లుతున్నట్లుగా గణాంకాలు తెలుపుతున్నాయి. ముఖ్యమంత్రి మరొక పిడుగు లాంటి వార్త ప్రకటించారు. పెండింగ్ డిఎలన్నీ పిఆర్‌సిలో కలిపి కొత్త స్కేల్స్‌తో కూడిన సిఫార్సులు రాబోతున్నాయని చెబితే ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేయడం జరిగింది.
పాలాభిషేకాలు కూడా చేశారు. కానీ అది ఎలా సాధ్యమో ఎవరూ చెప్పలేకపోయారు. ఎంత మేరకు ప్రతి ఉద్యోగికి నష్టమో మాత్రం అందరూ గ్రహించారు. ఇది కేవలం ఉద్యోగ పెన్షనర్లను చాలా తెలివిగా మోసం చేయడమే తప్ప అందులో వారికి చేస్తున్న మేలు ఏమాత్రం లేదు. మొత్తం మీద పిఆర్‌సి ఎంతెంత దూరం.. ఇంకెంత దూరం అన్నట్లుగా ఉంది. ఇది గ్రహించిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు అక్కడక్కడ ఈ సంఘాలు మాకొద్దు అంటూ తమ నిరసనను, అసంతృప్తిని వ్యక్తపరచడం గమనార్హం. ఇది ఉద్యోగ సంఘాల మనుగడకు ప్రమాదకరం కాగా ప్రభుత్వాలకు చాలా కలిసి వచ్చే అంశం. పాలక వర్గాలు ఎప్పుడూ సంఘాలలో చీలికలే కోరుకుంటారనేది వాస్తవం. ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న నగదురహిత చికిత్స ఎండమావిలాగా ఉంది. మొదటి జూన్ రెండవ తేదీన ప్రారంభించుతారని ఒక ప్రకటన వచ్చింది. అంతకుముందు అనేక కమిటీలు పలు అధ్యయనాలు, పర్యటనలు జరిగాయి.
చివరకు జూన్ 17న ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ పేరుతో ఒక సిఇఒ కొద్ది మంది ఉన్నతాధికారులు ఇంకా కొంతమంది ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కలిసి ఏర్పడింది. ఎంపికైన ఆసుపత్రులు వాటిలో సేవలందించే విభాగాలతో కూడిన ఒక జాబితా విడుదలైంది. అది చాలా అసమగ్రంగా ఉంది. నెట్వర్క్ ఆసుపత్రులతో ఒప్పందాలు లేకుండానే ఉత్తుత్తి ప్రకటనలు ఆర్భాటాలు జరిగాయి. అన్ని ఆసుపత్రులలో అన్ని జబ్బులకు చికిత్స కల్పించబడలేదు. ప్రమాదకరమైన క్యాన్సర్, గుండె జబ్బులు, పక్షవాతం, కిడ్నీ వ్యాధులు వంటి వాటికి ప్రత్యేక ఆసుపత్రి ఉండడం. మామూలే కానీ సాధారణ జబ్బులకు కూడా కొన్ని ఆసుపత్రులు ఎంపిక చేయబడలేదు. ఎంప్యానల్‌మెంట్ ఆ విధంగా జరిగితే ఉద్యోగ పెన్షన్లకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఏ విధమైన మార్గదర్శకాలు లేకుండానే జులై 15న ఈ నగదు రహిత చికిత్స ప్రారంభం అవుతుందని తెలిసి ఇది జరిగేనా అన్న అనుమానం కలిగింది. చివరకు అదే జరిగింది. అసలు విషయం తరువాత బయటపడింది. ఎంపికైన ఆసుపత్రుల యజమాన్యాలతో జబ్బుల చికిత్సకు ధరలు నిర్ధారణ కాకుండానే ఏదో హడావిడి జరిగింది. వారు రేట్ల పెంపు డిమాండ్ చేశారు. ఉద్యోగులు ప్రభుత్వానికి రెండు కళ్ళలాంటివారు. అవును ప్రభుత్వం మాత్రం తన దృష్టి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల పై సారించదు. వారి సంక్షేమం గురించి గొప్పగా ఉపన్యాసాలు మాత్రమే ఇస్తుంది. ప్రతిసారి వారికి రిక్తహస్తాలే అందిస్తారు. కేవలం ఎన్నికలకు పనికివచ్చే ముడి సరుకుగా మిగిలిపోతున్నారు.
అప్పుడప్పుడు సమ్మె నోటీసులు ఇచ్చి సంతృప్తి పడుతుంటారు. బొకేలు చేతికిచ్చి వాటిలోని పూలు తమ చెవులలో పెట్టించుకుని తిరుగుముఖం పడతారు. ఒకటవ తేదీనే జీతాలు, పెన్షన్లు ఇస్తున్నాం కాబట్టి మిగిలినవి ఏవి అడగకండి అన్నట్లుగా ఉంది ప్రభుత్వ వైఖరి. తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కుటుంబాలకు దూరంగా తిండి కూడా సరిగా దొరకని మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి, పనిచేసి విరమణ చేసిన వారికి ప్రభుత్వం కనీసం సాంత్వన చేకూర్చే విధంగా సంక్షేమ పథకాల రచన అమలు చేయలేకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. తీయని మాటలతో కడుపు నింపుదామంటే ఎలా కుదురుతుంది? రంగురంగుల మేనిఫెస్టోలు, అందమైన అక్షరాలతో ఆకాంక్షలు తీరవు. ఉత్సాహంగా సమావేశాలకు వెళ్లి చప్పట్లు కొట్టి ఉసూరుమనుకుంటూ బయటకు రావడం ఉద్యోగులకు అలవాటై పోయింది. క్షేత్రస్థాయిలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల పరిస్థితిని అర్థం చేసుకొని అందరికీ లబ్ధి చేకూరే విధంగా పనిచేయాలి. అప్పుడే వారు మనస్ఫూర్తిగా పని చేయగలుగుతారు. ప్రభుత్వం చెప్పే ప్రజాపాలనలో ఉద్యోగ పెన్షనర్లు లేరా అన్న ప్రశ్న ఉద్యోగ పెన్షనర్లలో ఉద్భవిస్తుంది. ఈ నేపథ్యంలోనే రెండున్నర సంవత్సరాలు ఆశగా ఎదురు చూసి భంగపడ్డ పెన్షనర్లు, ఇంకా అనేక సంఘాలు నేడు (ఆగస్టు 7 తారీఖున) ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నా నిర్వహించబోతున్నాయి. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరవనుందా?
శ్రీ శ్రీ కుమార్








