వారణాసి: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి లైసెన్స్‌డ్ పిస్తోలు ప్రమాదవశాత్తూ పేలడంతో ఇద్దరు సిబ్బంది గాయపడ్డారు. ప్రయాణికుడిని అదుపులోనికి తీసుకుని విచారణ జరుపుతున్నట్టు పౌర విమానయాన అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం 9.30 గంటలకు లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో ముంబై వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికుడు తన వద్ద 21 తూటాలు ఉన్న 7.62 ఎంఎం పిస్తోలు ఉన్నట్టు తెలియజేయడంతో అధికారులు అతనిని స్క్రీనింగ్ ఏరియాకు తీసుకువెళ్లారు. తుపాకీ అన్‌లోడ్ అయిందో లేదో తెలుసుకునేందుకు తనిఖీలు చేస్తుండగా అనుకోకుండా తుపాకీ నుంచి బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో అక్కడ విధుల్లో ఉన్న స్క్రీనింగ్ సిబ్బంది రోహిత్ రాజ్, సుమన్ కుమారి గాయపడ్డారు. వెంటనే ఈ ఇద్దరిని చికిత్స నిమిత్తం న్యూలక్ష్మీ ట్రామా సెంటర్‌కు తరలించారు. ప్రయాణికుడిని అజంగఢ్ జిల్లాకు చెందిన కమలేష్ కేదార్‌నాథ్ రాయ్‌గా గుర్తించారు.

కాగా, ఈ ఘటనపై సమగ్ర విచారణకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్), పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేశాయి. ఆయుధాల నిర్వహణకు సంబంధించిన నిబంధనలను సరిగ్గా పాటించారా లేదా అనేది పరిశీలించనున్నారు. సమాచారం తెలిసిన వెంటనే డీసీపీ (గోమతి జోన్), ఏసీపీ (పిండ్రా) సహా పోలీసు ఉన్నతాధికారాలు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదం జరిగినప్పటికీ ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగలేదని పౌర విమానయాన శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.