
వారమంతా నిద్రలేమితో సతమతమయ్యే వారికి తీపి కబురు
వారాంతాల్లో కాసేపు ఎక్కువ పడుకుంటే హృద్రోగ ముప్పు 20% డౌన్
అంతర్జాతీయ పరిశోధనలో ఆసక్తికర విషయాలు
14 ఏళ్ల సుదీర్ఘ నిఘా, 90,903 మంది ఆరోగ్య వివరాలతో చైనా శాస్త్రవేత్తల రీసెర్చ్
లండన్/బీజింగ్ : ఆధునిక ఉరుకుల పరుగుల జీవితం, ఐటీ- కార్పొరేట్ ఉద్యోగాలు, రాత్రిపూట షిఫ్టులు... కారణమేదైనా వారంలో ఐదు రోజులూ సరిపడా నిద్రలేక అలమటించిపోతున్నారా? అయితే మీకు ఒక శుభవార్త! వారాంతాల్లో (వీకెండ్స్‌లో) కాసేపు అదనంగా కంటినిండా నిద్రపోవడం వల్ల మీ గుండెకు బలమైన రక్షణ కవచం ఏర్పడుతుందని అంతర్జాతీయ వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వారమంతా పేరుకుపోయిన నిద్రలేమిని శని, ఆదివారాల్లో భర్తీ చేసుకోవడం (క్యాచ్-అప్ స్లీప్) ద్వారా గుండెజబ్బులు, పక్షవాతం వంటి ప్రాణాంతక సమస్యల ముప్పును దాదాపు ఐదో వంతు (20 శాతం) వరకు తగ్గించుకోవచ్చని ల్యాండ్‌మార్క్ రీసెర్చ్‌లో వెల్లడైంది.
90 వేల మందిపై 14 ఏళ్ల సుదీర్ఘ పరిశోధన
యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ (ఈఎస్సీ) వార్షిక సదస్సులో ఈ సంచలనాత్మక అధ్యయన పత్రాన్ని ప్రవేశపెట్టారు. చైనాలోని ప్రతిష్టాత్మక ‘ఫువాయ్ హాస్పిటల్’, నేషనల్ సెంటర్ ఫర్ కార్డియోవాస్క్యులర్ డిసీజెస్ పరిశోధక బృందం సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టింది. ‘యూకే బయోబ్యాంక్’ నుంచి సేకరించిన 90,903 మంది డేటాను విశ్లేషిస్తూ... హైటెక్ ‘యాక్సిలెరోమీటర్’ పరికరాల ద్వారా దా దాపు 14 ఏళ్ల పాటు వీరి నిద్ర వేళలు, గుండె పనితీరును క్షణక్షణం నిశితంగా పరిశీలించి ఈ ముగింపునకు వచ్చారు.
హృద్రోగాలకు బ్రేక్!
ఈ పరిశోధన కోసం సేకరించిన వివరాలను నిద్ర భర్తీ చేసుకునే తీరు ఆధారంగా నాలుగు విభాగాలుగా వర్గీకరించారు. వారంలో పనిదినాల్లో నిద్రలేమితో బాధపడుతూ, వీకెండ్స్‌లో అత్యధికంగా నిద్రను భర్తీ చేసుకునే వర్గంలో ఉన్నవారికి... అసలు వారాంతాల్లో కూడా నిద్రపోనివారితో పోలిస్తే గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం 20 శాతం తక్కువగా ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక సాధారణ జనాభా మొత్తాన్ని పరిగణనలోకి తీసుకున్నా, ఈ వీకెండ్ నిద్ర వల్ల 19 శాతం ముప్పు తప్పుతోందని తేలింది. విశేషమేమిటంటే- ఈ సానుకూల మార్పు మహిళలు, పురుషులు ఇద్దరిలోనూ ఒకే రీతిలో నమోదైంది.
ఒత్తిడికి చెక్... రక్తపోటు కంట్రోల్!
‘వారమంతా సరిపడా నిద్రపోకపోవడం వల్ల శరీరంపై పడే విపరీతమైన ఒత్తిడి, నాడీ వ్యవస్థలో ఏర్పడే అలజడిని ఈ వారాంతపు నిద్ర గణనీయంగా తగ్గిస్తుంది.
ఫలితంగా రక్తపోటు (బీపీ), హృదయ స్పందనలు (హార్ట్ రేట్) మళ్లీ సాధారణ స్థితికి వచ్చి గుండెకు విశ్రాంతి లభిస్తుంది‘ అని అధ్యయన ప్రధాన రచయిత యాంజున్ సాంగ్ వివరించారు.
ప్రత్యామ్నాయమే కానీ... శాశ్వత పరిష్కారం కాదు!
అయితే, వైద్య నిపుణులు ఒక హెచ్చరిక కూడా చేస్తున్నారు. రోజుకు 7 నుండి 8 గంటల క్రమబద్ధమైన నిద్రపోవడమే ఆరోగ్యానికి అసలైన శ్రీరామరక్ష అని స్పష్టం చేస్తున్నారు. వీకెండ్‌లో ఎక్కువ నిద్రపోవడం అనేది కేవలం వారమంతా చేసిన నిద్రలేమి లోటును భర్తీ చేసే ఒక ప్రత్యామ్నాయ ’తాత్కాలిక ఉపశమనం’ మాత్ర మే తప్ప, ప్రతిరోజూ నిద్రపోకపోవడానికి అదొక లైసెన్స్ కాదని సూచిస్తున్నారు.








