తమిళనాడు సిఎంగా విజయ్ ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనతో కలిసి పని చేసిన నటీ నటులు ఆ అనుభవాలను పంచుకుంటున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ ప్రియంకా చోోప్రా విజయ్‌ గురించి పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. ప్రియంకా విజయ్‌తో కలిసి నటించిన చిత్రం ‘తమిళన్’. ఈ సినిమా 2002లో విడుదలైంది. ఇది ప్రియాంక నటించిన తొలి చిత్రం కావడం మరో విశేషం. అయితే ఆ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటనని ప్రియాంక తెలిపారు.

‘‘నా మొదటి చిత్రం ‘తమిళన్’. అప్పుడు నాకు తమిళం అసలు రాదు. డైలాగులు పేపర్‌పై రాసుకొని బట్టీపట్టి చెప్పేదాన్ని. అప్పటివరకూ తెర వెనుక పరిస్థితులు ఎలా ఉంటాయో.. షూటింగ్ ఎలా చేస్తారో తెలియదు. థియేటర్‌లో సినిమాలు చూడడం మాత్రమే తెలుసు. ఆ షూటింగ్ సమయంలో విజయ్‌ను చూడటానికి వందల మంది అభిమానులు వచ్చారు. సెట్స్‌లో‌కి రావడానికి పోటీపడేవారు. ఆయన డ్యాన్స్ చేస్తున్నా.. డైలాగులు చెబుతున్నా కదలకుండా చూస్తూనే ఉండేవారు. ఆయనకు ఉన్న క్రేజ్ చూసి షాక్ అయ్యాను. అంతమంది ఆయనను అలా చూస్తుంటే.. విజయ్‌ను అందరూ దేవుడిలా చూస్తున్నారని నాకు అనిపించింది’’ అని ప్రియాంక తెలిపారు.