
హైదరాబాద్: కెసిఆర్‌కు, నాకు పోలికనా..? నందికి, పందికి ఉన్నంత తేడా ఉందని సిఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం అంబర్ పేట్ మున్సిపల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభలో సిఎం రేవంత్ మాట్లాడుతూ.. 1,000 రోజుల ప్రభుత్వ సొమ్ము మెక్కి గంట కూడా పనిచేయని కెసిఆర్ వెంటనే రాజీనామా చేయాలని అన్ని చోట్ల నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు. నేటి నుంచి ఆరు రోజుల పాటు ప్రతిపక్ష నాయకుడు రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో నిరసనలు తెలపాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఈనెల 6వ తేదీన ఇందిరా పార్క్ వద్ద నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని, 7వ తేదీ నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఎదురుగానే అన్ని విషయాలు చెబుతానని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
తెలంగాణకు న్యాయం చేయాలని అనుకుంటే, నమ్మకం ఉంటే అసెంబ్లీకి కెసిఆర్ రావాలని ఆయన సూచించారు. 1,000 రోజుల్లో కోటి ఇరవై నాలుగు లక్షల నలభై వేల జీతం కెసిఆర్ తీసుకున్నారని, ప్రభుత్వ ఉద్యోగి ఏడాది పాటు విధులకు రాకపోతే డిస్మిస్ చేస్తారని, మరి కెసిఆర్‌ను ఏం చేయాలని సిఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
ప్రతిపక్ష నేత హోదాలో కెసిఆర్ భద్రత, వసతుల కోసం 21 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసిందని సిఎం తెలిపారు. పదేళ్లలో కెసిఆర్ ఏం చేశారో, 1,000 రోజుల్లో తాను ఏం చేశానో అసెంబ్లీలో చర్చకు సిద్ధమని సిఎం సవాల్ విసిరారు. ఏనాడూ పదవిని దుర్వినియోగం చేయలేదని, చేయననీ, తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్ తాను ఒక్కడినేనని చెప్పి అధికారంలోకి రాగానే ఆ తర్వాత మొత్తం తన కుటుంబాన్ని దించి గుంపు మందలా జమై మంది సొమ్ము తిన్నారని సిఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పందికొక్కుల్లా తిని ఫాంహౌస్ నుంచి బయటకు రారా..? అని సిఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. దేశంలో ఎవరైనా ప్రతిపక్ష నాయకుడు 1,000 రోజులు బయటకు రాకుండా ఉన్నారా..? అని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్షం వైఫల్యం చెందిన రాష్ట్రం తెలంగాణ అని ఆయన ఆరోపించారు.








