న్యూఢిల్లీ: వచ్చే నెల 12న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ 57వ సమావేశం జరగడానికి ఒక రోజు ముందు, అనగా సెప్టెంబర్ 11న జిఎస్‌టి అధికారుల సమావేశం నిర్వహించనున్నట్లు కౌన్సిల్ సచివాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొననున్నట్టు తెలిపింది. అయితే, గత సంవత్సరం జరిగిన సమావేశంలో వస్తువులు, సేవలపై జిఎస్‌టి రేట్లు, పన్ను శ్లాబుల్లో భారీ మార్పులకు కేంద్రం, రాష్ట్రాలు నిర్ణయం తీసుకోగా.. ఇప్పుడు జరుగబోయే కౌన్సిల్ సమావేశంలో, నెలకు రూ.2.5 లక్షలకు పైగా పన్ను క్రెడిట్‌ను ఇతరులకు బదిలీ చేసే వ్యాపార సంస్థలకు జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసే అంశంపై చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా, జీఎస్టీ రిజిస్ట్రేషన్ రద్దు ప్రక్రియలో ఆటోమేషన్‌తో పాటు ఇతర మార్పులను కూడా కౌన్సిల్ పరిశీలించే అవకాశం ఉంది. ప్రస్తుతం నెలకు రూ.2.5 లక్షలకు పైగా పన్ను క్రెడిట్‌ను బదిలీ చేసే పెద్ద వ్యాపార సంస్థలకు జీఎస్టీ రిజిస్ట్రేషన్ మంజూరు చేసే విషయంలో కేంద్ర జీఎస్టీ విభాగాలు, వివిధ రాష్ట్రాల జీఎస్టీ విభాగాలు అనుసరిస్తున్న విధానాల్లో ఏకరూపత లేదు. దీనివల్ల పన్ను చెల్లింపుదారుల్లో అనిశ్చితి నెలకొంటోంది.