
హైదరాబాద్: ఇళ్లు కట్టుకునేవారికి మార్కెట్ ధర కంటే తక్కువగానే సిమెంట్ ఇప్పిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లలో చాలామంది నివసించట్లేదని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు విషయంపై శాసనమండలి సమావేశంలో పొంగులేటి ప్రసంగించారు. 2023 ఎన్నికల ముందు హడావిడిగా కొందరికి పట్టాలిచ్చారని, పేదలు నివసించే ప్రాంతంలోనే ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారని తెలియజేశారు. గతంలో పేదలు నివసించే ప్రాంతానికి 30-40 కి.మీ.దూరంలో ఇళ్లు ఇచ్చారని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో నివసించే వారిని అంటరానివారిగా చూశారని పొంగులేటి విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్లు కేటాయింపునకు నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకున్నామని, వచ్చే బోనాలు నాటికి ఇందిరమ్మ ఇళ్లు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఏ డిపార్టుమెంట్ ఆస్తి అయినా అది ప్రభుత్వానిదేనని, ప్రభుత్వ ఆస్తి అంటే అది ప్రజలకు చెందినదేనని పొంగులేటి పేర్కొన్నారు.








