న్యూఢిల్లీ : జపాన్ పెట్టుబడులతో నడిచే నెక్ట్ భారత్ వెంచర్స్ (ఎన్‌బివి) తన ఇంపాక్ట్ రిపోర్ట్ 2026ను విడుదల చేసింది. దీని ప్రకారం, గ్రామీణ, పట్టణ అసంఘటిత రంగాల్లోని 21 పోర్ట్‌ఫోలియో కంపెనీల ద్వారా 20 లక్షల మందికి లబ్ధి చేకూరింది. రైతులు, గిరిజన రైతుల ఆదాయం ఏటా 75%, చేతివృత్తిదారుల ఆదా యం 93%, అలాగే వీధి వ్యాపారుల ఆదాయం 25% చొప్పున పెరిగినట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. దక్షిణ భారతదేశానికి చెందిన కృషివన్, సిద్స్ ఫార్మ్ వంటి సంస్థలు 3.64 లక్షల మందికి పైగా లబ్ధి చేకూర్చి ప్రాంతీయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయి. ఆరోగ్య సంరక్షణ, మొబిలిటీ, వ్యవసాయం వంటి రంగాలు లక్ష్యంగా రూ. 20.76 కోట్ల కొత్త పెట్టుబడులను ప్రకటించారు. దీనిలో ప్రాణరక్షణ వ్యాక్సిన్ రవాణా సాధనం ఎమ్‌వోలియోను రూపొందించిన బ్లాక్‌ఫ్రాగ్ టెక్నాలజీస్‌కు రూ. 9 కోట్లు కేటాయించారు.

అలాగే ఇ-బిక్ సంస్థకు రూ. 7.5 కోట్లు, సిబోస్‌కు రూ. 2 కోట్లు, వేలన్ మార్ట్‌కు రూ. 1.26 కోట్లు, ఎస్‌జిబి ఆగ్రోకు రూ. 1 కోటి మేర నిధులు సమకూర్చారు. జపాన్‌కు చెందిన సుజుకి మోటర్ కార్పొరేషన్‌తో పాటు 5 ఎల్‌పిల మద్దతుతో రూ. 2,000 కోట్ల భారీ అంచనాతో ఫండ్2ను సిద్ధం చేస్తున్నారు. ఈ సందర్భంగా సంస్థ సిఇఒ విపుల్ నాథ్ జిందాల్ మాట్లాడుతూ, 20 లక్షల మందికి లబ్ధి చేకూర్చడం గొప్ప మైలురాయి అని అన్నారు. రాబోయే రోజుల్లో ఎఐ, హెల్త్‌కేర్ సాంకేతికతలతో ఇండియా 2, ఇండియా 3 లలోని నెక్ట్ బిలియన్ ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడమే సంస్థ లక్ష్యమని పేర్కొన్నారు. నీతి ఆయోగ్ మాజీ సిఇఒ అమితాబ్ కాంత్ మాట్లాడుతూ, ప్రధాన నగరాల సరిహద్దులు దాటి అసంఘటిత, గ్రామీణ వర్గాల ఆర్థిక సామర్థ్యాన్ని వెలికితీయడంపైనే భారత్ తదుపరి ప్రగతి ఆధారపడి ఉందన్నారు. సుజుకి ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్ ఫుజితాని మసావో నిలకడైన సామాజిక మార్పు కోసం తమ మద్దతు కొనసాగుతుందని ధృవీకరించారు.