
చెట్టు మీద ఒక పిట్ట రివ్వున ఎగిరి
వెళ్లిన వైపు చూపుల గాలం వేశాను
ఓ రెండు కళ్ళు, ఓ రెండు చేతులు
ఒక గాయాన్ని మోస్తూ తిరిగి వస్తున్న
శశిరాల్ని రాలుస్తున్నవి
దాటిపోలేని దుఃఖం, భూ వనరులనూ
మానవ వనరులనూ ఏకం చేసిన
చిచ్చుకు తెర తీసి, విరిసిన మానవత్వానికి
తెరవేసి విసిరిన వలలో
రెండు శరీరాలతో ప్రదర్శన చేయించడాన్ని
చూసి రక్తాశ్రువులు ప్రవహించినవి
నిచ్చెన మెట్ల సమాజం నిర్మించలేదే
ఏ నూతనోత్తేజ శిలా తోరణం
శాంతి అగ్ని కీలలపై ఒంటరి నడక
అక్కడ బూడిద కుప్పలు
గత జీవన దృశ్యం భళ్ళున పగిలిన
ఎన్నో రూపుల ప్రతిబింబం అవుతున్నది
వివస్త్రను చేసి నడిరోడ్డుపై నడిపిన దుర్మార్గం
పుట్టలు మొలిచిన మెదడులకు
ప్రతిబింబం అవుతున్నాయి
మణిపూర్, కాంగ్పోప్కి జిల్లా ఇంఫాల్‌కు
ఓ ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం
మైథీలు మెజారిటీ ప్రజలు, కుకీ తెగలు
కొండ ప్రాంతపు ప్రజలు
లోయాలో ఒక లోయ ప్రాంతం వర్గ పోరు హింస
ఇద్దరు మహిళలు వార్తా విశేషాలయ్యారు
కానీ.. కానీ.. ఆ రోజు ఏమైందంటే
దేశం తలవంచిందన్న సత్యాన్ని
మొత్తం బొత్తాములతో కట్టలేక, కొన్ని
మేధావుల బుర్రలు, సున్నిత మనసులు
భరత మాత పాదాలను కన్నీటితో కడుగుతున్నాయి
హృదయాలు చచ్చిన ఈ మగ మనుషులు
చేవచావని ఈ మర మనుషులు
ప్రతి అవసరానికి మహిళని పావులుగా చేస్తున్నందుకు
మనుషులు గానూ ప్రతిక్షణం మరణిస్తున్నారు
ఆ రోజును ఏమని చెప్పను?
నాలుగు మాటల కన్నీరు విడవడం తప్ప
- కొండపల్లి నిహారిణి








