
పాకిస్థాన్ మహిళల టి-20 జట్టు చరిత్ర సృష్టించింది. పరుగుల పరంగా తమ అత్యంత భారీ విజయాన్ని నమోదు చేసింది. జింబాబ్వేతో మంగళవారం (మే 12) జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 153 పరుగుల తేడాతో గెలిచి సత్తా చాటింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. దీంతో పాక్ మహిళల జట్టు అంతర్జాతీయ స్థాయిలో 200 పరుగుల మార్క్ తాకడం ఇదే తొలిసారి. ముఖ్యంగా అయేషా జాఫర్ 47 బంతుల్లోనే 15 ఫోర్లు, 2 సిక్సులతో 102 పరుగులు చేసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది.
మహిళల అంతర్జాతీయ టి-20 క్రికెట్‌లో మూడో అత్యంత వేగంగా సెంచరీ చేసిన క్రికెటర్‌గా ఆయేషా రికార్డు సాధించింది. అంతేకాక.. పాకిస్థాన్ తరఫున మునీబా అలీ తర్వాత టి-20ల్లో సెంచరీ చేసిన రెండో ప్లేయర్‌గా ఆయేషా జాఫర్ నిలిచింది. ఇక లక్ష్య చేధనలో జింబాబ్వే పూర్తిగా చేతులెత్తేసింది. 18.2 ఓవర్లలో కేవలం 84 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. పాక్ బౌలింగ్‌లో కెప్టెన్ ఫాతిమా 3, సదియా ఇక్బాల్, నతాలియా పర్వేజ్ చెరి రెండు, రమీన్ షమీమ్ ఒక వికెట్ తీశారు. ఫలితంగా మూడు టి-20ల సిరీస్‌లో పాక్ బోణీకొట్టింది. అంతకు ముందు జరిగిన మూడు వన్డేల సిరీస్‌ని కూడా పాకిస్థాన్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.













