
కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో విజిలెన్స్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. 10 మంది సభ్యులతో కూడిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల బృందం ఆకస్మికదాడి చేశారు. అనంతరం ఆసుపత్రిలోని డ్యూటీ చార్ట్ ప్రకారం ఉండాల్సిన వైద్యులు విధుల్లో ఉన్నారా లేదా అని బయోమెట్రిక్ యంత్రాలు, అటెండెన్స్ రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ కొందరు వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ కోసం ప్రభుత్వ విధులకు డుమ్మా కొడుతున్నట్లు వచ్చిన ఆరోపణలపై ఆరా తీశామన్నారు. ఆసుపత్రిలో ఉచితంగా జరగాల్సిన ల్యాబ్ పరీక్షల ప్రక్రియ పరిశీలన చేయడం జరిగిందన్నారు. రోగులను బయట ప్రైవేట్ ల్యాబ్‌లకు పంపిస్తున్నారా అనే కోణంలో రికార్డుల తనిఖీ,
ఫార్మసీలో స్టాక్ రిజిస్టర్ పరిశీలన చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం సరఫరా చేసే ఉచిత మందులు రోగులకు అందుతున్నాయా లేదా బయట మెడికల్ షాపులకు రాసిస్తున్నారా అన్నది తనిఖీ చేయడం జరిగిందన్నారు. ఆసుపత్రిలో రోగులకు అందించే ఆహారం నాణ్యతను, క్యాంటీన్ నిర్వహణ పరిశీలన, వార్డులలో పారిశుధ్యలోపాల గుర్తిచడం జరిగిందన్నారు. తనిఖీల్లో భాగంగా కొన్ని కీలక రికార్డులను, రిజిస్టర్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి, సిబ్బంది ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు.














