
రాష్ట్రానికి రేవంత్‌రెడ్డి శని పట్టిందని, ఆ శని పీడ విరగడ కావాలంటే రేవంత్‌రెడ్డి పోవాలి... కేసీఆర్ రావాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆనాటి తెలంగాణ ఉద్యమాన్ని తలపించేలా జగిత్యాలలో కేసీఆర్ సభ జరిగిందన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేసిన గొప్ప వ్యక్తి కేసిఆర్ అని కొనియాడారు. కేసీఆర్ పుణ్యంతోనే నీవు సీఎం అయ్యావని, కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించకుంటే నీవు సీఎం అయ్యేవాడివా అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ సభ సక్సెస్ కాకూడదనే నీవు మేడిగడ్డ వద్ద సభ పెట్టావు.. 30 మాసాలుగా అక్కడికి ఎందుకు పోలేదు? నిద్ర పోయావా అని రేవంత్‌ను ప్రశ్నించారు.
మేడిగడ్డ మరమ్మతు పనులకు కేవలం రూ.400 కోట్లు ఖర్చు చేస్తే సరిపోతుందని, మరమ్మతులు చేయకుండా కేసీఆర్‌ను దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. నేను పదవుల కోసం లొంగేవాడిని కాదని, నేనెవరిని తొక్కుకుంటూ రాలేదన్నారు. నాదేండ్లను ఎన్టీఆర్ మంత్రి వర్గంలో తొలగించడంతో నా మంత్రి పదవికి రాజీనామా చేసి పార్టీ నుంచి బయటికి వచ్చానన్నారు. 1984లో పార్టీ ఫిరాయింపు చట్టమే లేదని, అయినా నా పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరానన్నారు. నేను ఇంకా పదేండ్లు సీఎంగా ఉంటానని రేవంత్ విర్రవీగి మాట్లాడుతున్నాడని, ఈ రెండేండ్లు పూర్తిగా ఉంటాడో, ఊడతాడో కూడా తెలియదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సరిపడా ఎమ్మెల్యేలుండగా తన సొంత కుంపటి కోసమే బీఆర్ఎస్కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నాడని విమర్శించారు. బీఆర్ఎస్లో చేరికతో నా ప్రజా జీవితానికి నూతన అధ్యయం ఏర్పడిందని, తెలంగాణ పునర్నిర్మాణానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు.
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. రేవంత్ సీఎంలా వ్యవహరించకుండా వీధిరౌడీలా ప్రవర్తిస్తున్నాడన్నారు. నోరు తెరిస్తే బండ బూతులు మాట్లాడటం సీఎం స్థాయిలో ఉన్న రేవంత్‌రెడ్డికి తగదన్నారు. చావుకు ఎదురొడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినందుకా కేసీఆర్‌ను ఊరి తీసేదని ప్రశ్నించారు? ప్రాజెక్టులు నిర్మించి తెలంగాణను సస్యశ్యామలం చేసినందుకా? రైతన్నలకు అండగా నిలిచినందుకా, ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఆరాటపడినందుకా? ఎందుకు కేసీఆర్‌ను ఉరి తీయాలని ఈశ్వర్ రేవంత్‌రెడ్డిని నిలదీశారు.













