
మన తెలంగాణ/క్రీడా విభాగం: శ్రీలంకతో కొలంబో వేదికగా జరిగిన రెండో, చివరి టెస్టును టీమిండియా డ్రాగా ముగించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఫాలోఆన్ ఆడుతూ 8 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన శ్రీలంక చిరస్మరణీయ ప్రదర్శనతో మ్యాచ్‌ను డ్రా చేసిన సంగతి తెలిసిందే. నాలుగో రోజు భారత బౌలర్లు పూర్తిగా నిరాశ పరిచారు. తీవ్ర ఒత్తిడిలో ఉన్న లంక బ్యాటర్లను పెవిలియన్‌కు పంపించడంలో టీమిండియా బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. వన్‌డౌన్‌లో వచ్చిన పసిందు సూర్యాభండారను ఔట్ చేయడంలో బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. పిచ్ బౌలింగ్‌కు సహకరిస్తున్న ఫలితం లేకుండా పోయింది. పేలవమైన బౌలింగ్‌కు చెత్త ఫీల్డింగ్ తోడు కావడంతో పసిందు, కమిందు మెండిస్ భారత బౌలర్లతో ఓ ఆట ఆడుకున్నారు. ఒత్తిడిని సయితం తట్టుకుంటూ వీరు సాగించిన పోరాటాన్ని ఎంత పొగిడినా తక్కువే. పసిందు మరోసారి భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మెండిస్ కూడా అద్భుత పోరాట పటిమను కనబరిచాడు.
దీంతో నాలుగో రోజు భారత్ కేవలం నాలుగు వికెట్లు మాత్రమే పడగొట్టారు. ఇక చివరి రోజు సోనల దినుష అసాధారణ ప్రదర్శనతో టెస్టు చరిత్రలోనే చిరకాలం గుర్తుండి పోయే ఇన్నింగ్స్ ఆడాడు. తీవ్ర ఒత్తిడిని తట్టుకుంటూ అతను కొనసాగించిన పోరాటాన్ని ఎంత పొగిడినా తక్కువే. భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగిన సోనల్ 133 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక కేశర నువాంత 150 బంతులు ఎదుర్కొని భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. ఇక లహిరు కుమార అయితే ఏకంగా 90 బంతుల పాటు వికెట్‌ను కాపాడుకున్నాడు.
అసిత ఫెర్నాండో కూడా భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. చివరి వరుస బ్యాటర్లను ఔట్ చేయడంలో టీమిండియా బౌలర్లు విఫలం కావడంతో లంక అనూహ్యంగా డ్రాతో గట్టెక్కింది. చివరి రెండు రోజుల ఆటలో టీమిండియా బౌలర్లు లంకకు చెందిన 8 వికెట్లను పడగొట్టక పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బౌలింగ్ విభాగంలో అర్థపర్థం లేని ప్రయోగాల వల్లే ఇలాంటి దుస్థితి ఎదురవుతుందని పలువురు మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకోవాలంటే రానున్న సిరీస్‌లలో టీమిండియా బౌలింగ్ మెరుగు పడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.








