పశ్చిమ బెంగాల్‌లో బిజెపి , ఎన్నికల సంఘం సంయుక్తంగా ఇప్పుడు ఏకంగా చోర్ బజార్ ఏర్పాటు చేశాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. రాష్ట్రంలో అధికారం మారిన తరువాత ఇప్పుడు జరిగిన ఉన్నత స్థాయి నియామకాలపై రాహుల్ మంగళవారం స్పందించారు. ఇంతకు ముందు దొంగకు కొరడా దెబ్బలు ఉండేవి. ఇప్పుడు ఇక్కడ పద్థతి మారినట్లుందని ఆయన స్పందించారు. ఎంత పెద్ద చోరీ చేస్తే అంత పెద్ద నజరానా అనే బాపతుగా వ్యవహారం మారిందని తెలిపారు. బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా మాజీ సిఇసి మనోజ్ అగర్వాల్‌ను నియమించారు.

ఇక ఇంతకు ముందు సర్ నిర్వాహకుడుగా ఉన్న సుబ్రతా గుప్తాను ముఖ్యమంత్రి సువేందుకు ప్రధాన సలహాదారు చేశారు. ఇది బెంగాల్‌లో వీరు ఓట్ల చోరీని విజయవంతం చేసినందుకు దక్కించుకున్న ప్రతిఫలం అని రాహుల్ సామాజిక మాధ్యమంతో తెలిపారు. ఇప్పుడు కథ అంతా కూడా బిజెపిఇసి చోర్ బజార్ , పవర్ లూఠీ అయిందని విమర్శించారు. సర్ ద్వారా లక్షల ఓట్లను తొలిగించడంలో పావు కదిపిన అధికారిని ఇప్పుడు సిఎం ఏకంగా తన సలహాదారుడిగా పెట్టుకుని , ఆయన పట్ల ఉదారభావం ప్రదర్శించారని వ్యాఖ్యానించారు.