నేను, నాసాహితీ యాత్ర: 28 నా బాల్యం యానాంలోని ఆదియాంధ్రపేటలో సాగింది. తర్వాత కాలంలో అది అంబేడ్కర్‌నగర్‌గా మారింది. శ్రీదీనపోషక సమాజం రాత్రి పాఠశాలలో చదువుకున్నాను. యానాం మహాత్మాగాంధీ హైస్కులులో పదోతరగతి, జూనియర్ కాలేజీలో ఇంటర్, కాకినాడ పి.ఆర్.కాలేజీలో బి.ఎ.స్పెషల్ తెలుగు, ఆంధ్రా యూనివర్సిటీలో ఎం.ఎ., చదివాను. తర్వాత పఠాభి సాహిత్యంపై అత్తలూరి పర్యవేక్షణ లో డాక్టరేటు చేసాను. తెలుగు విశ్వవిద్యాలయం అప్పటి ఉపాధ్యక్షులు, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డా. సి.నారాయణరెడ్డి గారి ఆశీస్సులతో తులనాత్మక అధ్యయన కేందంలో 1991లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరి 2015 డిసెంబరు 31న ప్రొ ఫెసర్‌గా పదవీ విరమణ చేసాను. మధ్యలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి ‘తెలుగు మరాటీ దళిత కవిత్వం’పై రెండో డాక్టరేట్ చేసాను.

తల్లితండ్రులు కర్రి ఆదిలక్ష్మి, కర్రి సూర్యనారాయణ. నేను నెలల వయసులో వున్నప్పు్పడే మా అమ్మ చనిపోయింది. అప్పటినుండి మా నాయన మిత్రుడైన జి.రత్న శిఖామణి గారు నన్ను పెంచడంతో పాటు, మా కుటుంబాన్ని సాకారు. మా నాయన, శిఖామణిల స్నేహం చూసి కథ రాయాలనిపించి ఒక కథ రాసాను. ఏవో కవితలు కూడా రాసేవాణ్ణి. శిఖామణి గారు వాటిని చూసి కాగితాలు, సిరా దండగ అనేవారు. నా ఇంటర్ పూర్తయ్యాక శిఖామణి గారు చనిపోయారు. నా అసలు పేరు కర్రి సంజీవరావు. లావణ్య, శ్రీకాకుళ వంటి కలం పేర్లు పెట్టుకున్న నేను అమ్మలా నన్ను పెంచి పెద్దచేసిన శిఖామణి గారి జ్ఞాపకార్థం ఆయన పేరును నా కలం పేరుగా చేసుకున్నాను.

బి.ఎ.కాలేజీ మేగ్జేన్‌లో నా ‘ఆత్మ కథ’ అచ్చయింది. నా సాహితీ సృజన కథతో ప్రారంభం అయినా, సమాంతరంగా కవిత్వమూ రాసేవాణ్ణి. అది మినీ కవిత్వం ఉద్యమ రూపం ధరించిన కాలం. నా మొదటి కవిత ’హోరుగాలి’, 3 డిసెంబర్ 1978 నాటి ఆంధ్రజ్యోతి ఆదివారం సారస్వతానుబంధంలో అచ్చయిం ది. నా మొదటి కథ ‘నో థేంక్స్’ కూడా 7 జనవరి 1979 ఆంధ్రజ్యోతిలోనే అచ్చయింది. బి.ఎ.చదువుతు న్న రోజుల్లోనే ‘అద్దెఇల్లు, స్కూటర్ వాలా, వంటి నా కథలు కొన్ని ఆం ధ్రపత్రిక వీక్లీలో అచ్చయ్యాయి. లత, జొన్నలగడ ్డలలితాదేవిలు సంకలనం చేసిన కథా సంపుటాల్లో నా కథలు చోటు చేసుకున్నాయి. కథ లు, మినీ కవితలు పక్కన పెట్టి పూర్తిస్థాయి వచన కవిత్వం వైపు నేను దృష్టి మళ్ళించాను. ఎం.ఏలో అత్తలూరి నా కవితలను సరిచేస్తే, నా జూనియర్, కవి మిత్రుడు గాలి నాసర రెడ్డి తన ముత్యాలకోవ లాంటి దస్తూరీతో నా కవితలను ఎత్తి రాస్తే భారతి పత్రికకి పంపితే అచ్చయ్యేవి.

శ్రీశ్రీ, తిలక్, శేషేంద్రల కవిత్వాన్ని ఇష్టంగా చదువుకోవడం వల్ల తొలిరోజుల్లో ఆ కవుల కవిత్వంతో ప్రభావితం అయ్యాను. ఆ తర్వాత రోజుల్లో ఇస్మాయిల్, మోహన్‌ప్రసాద్, అజంతా, శివారెడ్డి వంటి వారి కవిత్వాన్ని ఇష్టంగా చదువుకున్నాను. 18 అక్టోబర్ 1987న నా మొదటి కవితా సంపుటి మువ్వల చేతికర్ర ఆవిష్కరణ జరిగింది. దానికి ఇస్మాయిల్ గారు మంచి ముందుమాట రాయడమే కాకుండా స్వయంగా ప్రూఫ్‌లు దిద్దడం, ప్రచురణ బాధ్యతలు తలకెత్తుకోవడం నేను, నా కవిత్వం చేసుకున్న అదృష్టంగా ఇప్పటికీ భావిస్తాను. మువ్వల చేతికర్ర, నా కవిత్వభూమి, నా కవిత్వ ఆకాశం కూడా. 1987 మువ్వల చేతి కర్ర నుండి, 2021 తెల్లవారు జాము కల వరకూ దాదాపు 12 కవితా సంపుటాలు, 6 విమర్శ సంపుటులు వెలువరించాను.

నా కవిత్వం ఇంగ్లీషు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోకి అనువాదం అయి గ్రంధాలుగా ముద్రింపబడ్డాయి. వివిధ విశ్వవిద్యాలయాల్లో నా కవిత్వంపై మూడు పిహెచ్.డిలు, నాలుగు ఎం.ఫిల్ పట్టాలు వచ్చాయి. నా పర్యవేక్షణలో 25 మంది డాక్టరేట్లు, 40 మంది ఎం.ఫిల్ పట్టాలు పొందారు. ఇన్నేళ్ల నా సాహిత్య ప్రయాణంలో ఎందరో కవులు, రచయితలు, సంస్థలు నా కవిత్వాన్ని ఆదరించి ఎన్నో పురస్కారాలు అందజేశారు. అమలాపురం సమతా రచయితల సంఘం పురస్కారం (1987) నుండి అజోవిభోకందాళం వారి సాహితీమూర్తి’ పురస్కారం (2022) వరకూ దాదాపు నలభై పురస్కారాలు అందుకున్నాను. వాటిలో ఫ్రీవెర్స్ ఫ్రంట్, తెలుగు విశ్వవిద్యాలయం, సినారె, తిలక్, సోమసుందర్, సాహితీ మాణిక్యం, శ్రీకాంత శర్మ,చందు సుబ్బారావు సాహితీ పురస్కారాలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి కళారత్న, మహాకవి గుర్రం జూషువా కోకిల’ పురస్కారం వంటివి వున్నాయి.

తెలుగు విశ్వవిద్యాలయంలో డా.బోయి భీమన్న సాహిత్య పీఠం కన్వీనర్‌గా భీమన్న సమగ్ర సాహిత్య సంపుటాలకు సంపాదకుడిగా వ్యవహరించడం కవిగా నాకు దక్కిన గొప్ప సాహిత్య గౌరవం.2000లో లండన్ బర్మింగ్ హోమ్‌లో ఠజైండవ ప్రపంచ దళిత రచయతల సదస్సు’లో పాల్గొని, నా The black rainbow ఆంగ్ల దళిత కవితా సంపుటిని ఆవిష్కరించాను. ‘కవిసంధ్య’ సాహిత్య సంస్థ- రెండు దశాబ్దాలుగా హైదరాబాద్‌లో సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చింది. 2015లో రిటైర్ అయ్యాక, నేను వ్యవస్థాపక సంపాదకుడిగా కవి సంధ్య పత్రిక ఏప్రిల్ 2016, దుర్ముఖి నామ ఉగాది పర్వదినాన యానాం నుండి ప్రారంభం అయిం ది. ఈ 2026కి దశాబ్ది పూర్తి చేసుకుని 60వ సంచికకు చేరింది.

కవి సంధ్యతో పాటు దళిత రచయితల వేదిక కన్వీనర్‌గా సదస్సు లు, 2005లో తెలుగు విశ్వవిద్యాల యం సౌజన్యంతో నాలుగు రోజులు దళిత కవిత్వ శిక్షణా శిబిరాన్ని నిర్వహిం చాం. కవిసంధ్య లీటరరీ క్యా లెండర్‌లో భాగంగా ప్రముఖ కవుల శతజయంతులు, కవిసం ధ్య గ్రంధమాల ద్వారా సాహిత్య గ్రం ధాల ముద్రణ, మార్చి 21 అంతర్జాతీయ కవి తా దినోత్సవం, వేసవి కవిత్వ శిక్షణా శిబిరాలు, కవిత్వ సదస్సులు నిర్వహించడం వంటివి చేస్తున్నాం.

2016లో ‘యానాం కవితా ఉత్సవం’ దాదాపు 300 మంది కవులు, రచయితలు,కళాకారులతో నిర్వహించడం జరిగింది. మళ్లీ 2027 అక్టోబర్‌లో అలాం టి ఉత్సవానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. నన్ను ఇంతగా ఆదరించిన కవితా ప్రపంచానికి ఏదైనా చెయ్యాలని నేను రిటైర్డ్ అయ్యాక నా పెన్షన్ డబ్బుతో కవిసంధ్య పేరిట పురస్కారాలు ఇవ్వడం ప్రారంభించాను. జీవనసాఫల్య, యువ, ప్రతిభా పురస్కారాలు గత పన్నెండు సంవత్సరాల నుండి ప్రదానం చేస్తున్నాం. అంబేడ్కర్ మీద గత 50 సంవత్సరాలుగా తెలుగులో వచ్చిన పద్య, గేయ, వచన కవిత రచనల బృహత్ సంకలనం అయిదేళ్ళ క్రితమే ‘అంబేడ్కర్ శకం’ పేరుతో సంకలనం సిద్ధం చేశాను. దాన్ని త్వరలో ముద్రించాలి. అలాగే దళిత సాహిత్య కోశం, దళిత వైతాళికులు వంటి గ్రంథాలు తయారీలో ఉన్నాయి.

దాదాపు నలభై ఏళ్లుగా కవిగా కొనసాగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. భూమిని ఓజోనుపొర రక్షిస్తున్నట్టు సమస్త మానవాళికి కవిత్వం రక్షణ కవచంగా నిలిచిందనీ, నిలుస్తుందనీ నా నమ్మకం. అందుకు నేను, నా సాహిత్య జీవితమే సాక్ష్యం. నేను కవిత్వం ( సాహిత్యం)చదువుకోక పొతే, రాసుకోక పొతే ఈ పాటికి ఏమైపోదునో! నేను రాసిన సాహిత్యం అంతా ఒకచోట వుంటే బాగుంటుందని, ముందు తరాలకు అందుబాటులో ఉంటుందని భావించి అన్నింటినీ కలిపి ఏడు సంపుటాలుగా వెలువరించాను. చివరగా, ఉత్తమ అభిరుచి గల పాఠకులు వున్నప్పుడే ఉత్తమ సాహిత్యం వస్తుందని నేను నమ్ముతాను.


- శిఖామణి