బీజింగ్: చైనా దేశంలోని సిచువాన్‌ ప్రావిన్స్‌లో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.1గా నమోదైందని భూపరిశోధన అధికారులు వెల్లడించారు. భూమి కంపించడంతో స్థానికులు భయంతో పరుగులు చేశారు. చైనా-నేపాల్‌ సరిహద్దులో భూకంప కేంద్రం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఒక వైపు భారీ వర్షాలు, మరో వైపు భూకంప తీవ్రతతో నేపాల్‌కు మరో భారీ జల ప్రళయం ఉంటుందని నేపాల్ అధికారులు హెచ్చరించారు.  నిన్నటితో పోలిస్తే 5 రెట్ల తీవ్రతతో మరోసారి నేపాల్‌కు భయంకరమైన వరదలు సంభవిస్తాయని అలర్ట్ చేశారు. మరో 20 నిమిషాల్లో వరదలు వస్తాయని పోలీసులు హెచ్చరించడంతో నేపాలు వాసులు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. నేపాల్‌ వాసులు తీవ్ర భయాందోళనలతో ఎత్తైన ప్రదేశాలకు చేరుకుంటున్నారు. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని కాలం వెళ్లదీస్తున్నారు. భారీ మంచు కొండలు బద్దలవ్వడంతో భూమి కంపించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. మంచి శిథిలాలు వరదల్లో కొట్టుకొని రావడంతోనే జలప్రళయానికి కారణమయ్యాయని యుఎస్ జిఎస్ ప్రకటించింది.