టోక్యో/టెహరాన్: ఇరాన్ అణుస్థావరాల తనిఖీ విషయం ఇప్పుడు కీలక జటిల సమస్య అయింది. అమెరికా ఇరాన్ ఒప్పందంలో భాగంగా ఈ అణు స్థావరాలను తనిఖీ చేసేందుకు ఐరాస అణు సంస్థ సిద్ధం అయింది. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ అధినేత(ఐఎఇఎ) రాఫెల్ మోరియానో గ్రాసీ బుధవారం కీలక ప్రకటన వెలువరించారు. తమ సంస్థకు చెందిన ఇన్‌స్పెక్టర్లు ఇరాన్‌లోని అణు కేంద్రాలను తనిఖీ చేస్తారని , ఇందుకు తాము తగు ఆదేశాలు వెలువరించామని తెలిపారు. ఇప్పటి ఒప్పందంలో అణు కేంద్రాల సామర్థం అత్యంత ప్రధానమైన విషయం అయింది. దీనితో ఇప్పుడు ఇరాన్ వివాదాస్పద అణు కేంద్రాలలో శుద్ధి చేసిన యురేనియం నిల్వలు , అణ్వాయుధ తయారీ విషయాలను పసికట్టాల్సిన అవసరం ఉందని రాఫెల్ తెలిపారు.సునామీ తాకిడికి గురైన జపాన్‌లోని ఫుకుషిమా డలిచి అణు ఇంధన కేంద్రం వద్ద మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాజకీయ ప్రకటనలను తాను అర్థం చేసుకుంటానని, ఇందులో వాస్తవాలే ఉండొచ్చు. అయితే ఇద్దరు దేశాధ్యక్షులు సంతకాలు చేసిన ఎంఒయు గురించి తాను చెప్పాల్సి వస్తోందని తెలిపారు. దీని మేరకు ఇరాన్ అణు కేంద్రాల పర్యవేక్షణ అవసరం అన్నారు. అణు స్థావరాలలో పరిస్థితి ఏమిటనేది తాము తెలుసుకోవల్సి ఉంటుందన్నారు. ఇది ఇప్పటికిప్పుడు జరగవచ్చు , పది రోజుల తరువాత అయినా జరగొచ్చు , ఇది కీలక అంశమే, అయితే తప్పనిసరి కాకపోవచ్చు అని స్పందించారు. పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తేనే ఆయా కేంద్రాలలో ఉన్న అణు నిల్వలను అంచనా వేయడానికి వీలేర్పడుతుంది. ఈ అంశాన్ని అణు నిపుణులతో కూడిన తమ సాంకేతిక బృందం పర్యవేక్షిస్తుందని వివరించారు. అయితే ఇక్కడ ఓ చిక్కు ముడి ఉంది. ఇరాన్‌పై గత ఏడాది ఇజ్రాయెల్ జరిపిన 12 రోజుల దాడుల ప్రతిచర్యగా ఇరాన్ తమ అణు స్థావరాల పర్యవేక్షణలపై అంతర్జాతీయ అణు సంస్థకు అనుమ తిని నిరాకరించింది.

తుది ఒప్పందం ఖరారు తరువాతే తనిఖీలు ః ఇరాన్

ఇరాన్ అణు కేంద్రాల తనిఖీ గురించి అణు ఇంధన సంస్థ చీఫ్ చేసిన వ్యాఖ్యలను ఇరాన్ తోసిపుచ్చింది. దేశ విదేశాంగ శాఖ ఉప మంత్రి కజెం ఘరిబాబాదీ ఇరాన్ వైఖరిపై అధికారిక ప్రకటన వెలువరించారు. అమెరికా, ఇరాన్ మధ్య ఇప్పుడు శాంతి స్థాపన దిశలో కుదిరింది కేవలం ఎంఒయునే. ఇరు పక్షాల మధ్య పూర్తి స్థాయి తుది ఒప్పందం తరువాతనే ఈ తనిఖీలకు తమ దేశం అనుమతి ఉంటుందని ఆయన తెలిపారు. అణు స్థావరాలను చూసేందుకు కానీ తమ దేశ అణు వనరుల పరిశీలనకు కానీ ఎటువంటి అవకాశాలు లేవని తేల్చిచెప్పారు.ఎదుటి పక్షం తర అంగీకారం మేరకు ఇరాన్‌పై ఆంక్షలు, ఇతరత్రా చర్యలను కూడా నిలిపివేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అమెరికా చేపట్టే వాస్తవిక కారాణను బట్టే ఇరాన్ ప్రతిస్పందన ఉంటుందని, ఇది సహజమే కదా అని ప్రశ్నించారు.