
హైదరాబాద్: ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కాదని.. ఇది వికాస ఉత్సవం అని తెలంగాణ అభివృద్ధికి ఎంతో కీలకం అని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రధాని ప్రణాళిక అయిన వికసిత్ భారత్ కలసి నడుస్తామని అన్నారు. హైదరాబాద్ లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు. ప్రధాని మోడీని గవర్నర్ శివప్రతాప్ శుక్లా, సిఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. శాలువాతో సిఎం సత్కరించి, నంది జ్ఞాపికను అందించారు. హెచ్ఐసిసి వర్చువల్ గా రూ. 9, 377 కోట్ల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా హెచ్ఐసిసి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిపోయాయని, ఇప్పుడు రాజకీయాలు మాట్లాడాల్సిన పనిలేదని.. అభివృద్ధి గురించే మాట్లాడదామని అన్నారు.
2047 పాలసీ డాక్యుమెంట్ రూపొందించామని, 5 రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లడానికి మోడీ వచ్చారని రేవంత్ పేర్కొన్నారు. 3 శాతం జనాభా ఉన్న తెలంగాణ దేశంలో 10 శాతం ఎకనామీని లక్ష్యంగా పెట్టుకుందని, 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ల ఎకనామీ చేరుకోవడమే తమ లక్ష్యమని తెలియజేశారు. దేశంలో 6 నగరాలను గ్రోత్ ఇంజిన్ లా అభివృద్ధి చేయండి అని ఆరోజు దివంగత ప్రధానమంత్రి మన్మోహన్ లాగా, ఇప్పుడు తమ సహకారం కావాలని కోరారు. 2034 నాటికి తెలంగాణ ట్రిలియన్ డాలర్ల ఎకనామీ సాధిస్తుందని, మోడీ ఆశీర్వాదం ఉంటే వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. దేశాభివృద్ధిలో ఆరు మహానగరాలు కీలక పాత్ర పోషిస్తాయని, దేశానికి సింహభాగం ఆదాయం ఇస్తున్న ఆరు నగరాలను కేంద్రం ప్రోత్సహించాలని రేవంత్ రెడ్డి కోరారు.















