
హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉంది
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్: అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ఎస్సి, ఎస్టి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. ఆర్థిక సమస్యల కారణంగా పెన్షన్ల పెంపు ఆలస్యం అవుతోందని ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో చెప్పారు. బిఆర్ఎస్ 2014, 2018 ఎన్నికల ప్రణాళికలో దివ్యాంగులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా, మళ్లీ 2023 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందని ఆయన విమర్శించారు. పదేళ్ల పాటు తామే రాజులం, తామే మంత్రులం, తమకు ఎదురులేదన్నట్లుగా వ్యవహరించారని ఆయన విమర్శించారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యే టి. హరీష్ రావు దివ్యాంగుల సమావేశం ఏర్పాటు చేసి పచ్చి అబద్ధాలు చెప్పారని ఆయన దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏకవచనంతో సంబోధిస్తూ విమర్శలు చేయడం భావ్యం కాదన్నారు. దివ్యాంగులను బలవంతంగా సమావేశానికి పిలిపించుకుని విమర్శలు చేయించారని ఆయన తూర్పారపట్టారు. హరీష్ రావు చేసిన వ్యాఖ్యల్లో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు.
దివ్యాంగులకు రూ.50 కోట్లతో వాహనాలు, బ్యాటరీ వెహికిల్స్‌తో పాటు ఇతర పరికరాలు అందించినట్లు ఆయన చెప్పారు. వచ్చే ఏడాదిలో మరో రూ.50 కోట్లతో వాహనాలను అందిస్తాం అన్నారు. దివ్యాంగులకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయించినట్లు ఆయన తెలిపారు. కొత్తగా దివ్యాంగులకు పెన్షన్లు మంజూరు చేస్తున్నాం అని, పూర్తి అంగవైకల్యంతో జన్మించే వాళ్లకు బాల్ భరోసా పథకం ద్వారా ప్రభుత్వమే పూర్తి ఖర్చును భరించి వైద్యం అందిస్తోందన్నారు. ఆర్టీసీలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే అంశంపై ముఖ్యమంత్రితో చర్చించనున్నట్లు చెప్పారు. దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ చెల్లిస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నట్లు ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వికలాంగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పని చేస్తున్నదని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తాం అని ఆయన తెలిపారు. 2018, 2014 ఎన్నికల సమయంలో బిఆర్ఎస్ మ్యానిఫెస్టోలో పెట్టి అమలు చేయని వాటికి ఆ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు రూ.3 వేల భృతి చెల్లిస్తామని బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కన పెట్టిందని ఆయన విమర్శించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తామని మ్యానిఫెస్టోలో చెప్పారని, చివరకు ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని ఆయన ధ్వజమెత్తారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అని మోసం చేశారని ఆయన తూర్పారపట్టారు. కొత్త యూనివర్సిటీలు నిర్మిస్తామని చెప్పారని, కనీసం ఉస్మానియా యూనివర్సిటీకి నిధులు విడుదల చేయలేదని ఆయన దుయ్యబట్టారు. తన పార్టీ నాయకుల ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు అనుమతి ఇచ్చారని ఆయన కెసిఆర్‌పై మండిపడ్డారు.
ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మోసం చేశారని, చట్ట సభల్లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మరిచారని మంత్రి అడ్లూరి విమర్శించారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని వంచించారని, బిఆర్ఎస్ పార్టీ 2014, 2028 మ్యానిఫెస్టోలో చెప్పి అమలు చేయని అంశాలు చాలా ఉన్నాయన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఒక్క పేదవాడికి ఇల్లు కట్టించలేదని, ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లను తమ ప్రభుత్వం ఇచ్చిందని, గుండె మీద చేయి వేసుకుని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, ఎమ్మెల్యే హరీశ్ రావు దీనిపై సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ రేషన్ కార్డులు ఇచ్చామని, సన్న బియ్యం ఇస్తున్నామని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని ఆయన తెలిపారు. రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని, ఇప్పటికే అనేక చోట్ల నిర్మాణాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. 1000 రోజుల వైఫల్యాలపై పోరాటం చేస్తామని కెటిఆర్ చెప్పడాన్ని ఆయన ప్రస్తావిస్తూ తమ పాలనపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని అసెంబ్లీకి వచ్చి చర్చించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ డిమాండ్ చేశారు.








