
న్యూఢిల్లీ: ఢిల్లీలో ముసాయిదా ఓటర్ల జాబితా సోమవారం విడుదలైంది. మొత్తం 1.45 కోట్ల మంది ఓటర్లలో 47.56 లక్షల మందికి పైగా పేర్లు ఈ జాబితాలో లేవు. అంటే దాదాపు ప్రతి ముగ్గురిలో ఒకరి పేరు తొలగించినట్లయింది. పేర్లు గల్లంతైన వారు సెప్టెంబరు 30 వరకు ఫారం-6, సంబంధిత ఆధారాలను సమర్పించి ఓటర్ల జాబితాలో తమ పేర్లను చేర్చాలని కోరవచ్చు. తుది ఓటర్ల జాబితాను నవంబరు 4న ప్రకటించనున్నట్లు ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయ అధికారులు తెలిపారు.
సవరించిన ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం.. అభ్యంతరాలు, దావాలను పరిశీలించే ప్రక్రియ కొనసాగుతుంది. నోటీసులు జారీ చేయడం, వాటిపై నిర్ణయం తీసుకునే ప్రక్రియ అక్టోబరు 29 వరకు కొనసాగనుంది. ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) చేపట్టిన అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పోలిస్తే.. ముసాయిదా దశలో ఢిల్లీలోనే అత్యధికంగా 33 శాతం మంది ఓటర్ల పేర్లు తొలగించినట్లు అధికారులు తెలిపారు. సంఖ్యాపరంగా చూస్తే ఢిల్లీలో తొలగించిన 47 లక్షలకుపైగా ఓటర్ల సంఖ్య కూడా అత్యధికంగా ఉన్న వాటిలో ఒకటని అధికారులు పేర్కొన్నారు. దేశ రాజధాని కావడంతో ఢిల్లీలో వలసలు, రాకపోకలు ఎక్కువగా ఉండే జనాభా అధికంగా ఉంటుందని, అందువల్లే పేర్ల తొలగింపు సంఖ్య ఎక్కువగా ఉండొచ్చని ఓ ఎన్నికల అధికారి తెలిపారు.
కర్ణాటకలో 4.46 కోట్ల మంది ఓటర్లలో 1.07 కోట్ల మంది పేర్లు ముసాయిదా జాబితా నుంచి తొలగించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంఖ్య 44.89 లక్షలుగా ఉంది. దాద్రా, నగర్ హవేలీ, దమన్ అండ్ దీవ్‌లో ఎస్‌ఐఆర్ కింద విడుదల చేసిన ముసాయిదా జాబితాల్లో మొత్తం ఓటర్లలో 29.64 శాతం మంది పేర్లు తొలగించారు. ఢిల్లీలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 97,53,577 మంది ఓటర్ల పేర్లు ముసాయిదా జాబితాలో ఉన్నాయి. మరో 47,56,722 మంది పేర్లు అందులో చోటు దక్కించుకోలేదు. జూన్ 30న ప్రారంభమై ఆగస్టు 17న ముగిసిన ఇంటింటి సర్వేలో అందిన గణన ఫారాలను డిజిటలైజ్ చేసి, వాటి ఆధారంగా ఈ ముసాయిదా జాబితాను రూపొందించారు.
మొత్తం 1,45,10,299 మంది ఓటర్లలో గైర్హాజరు, వేరే ప్రాంతానికి తరలివెళ్లిన వారు, మరణించిన వారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన వారు, ఇతర కారణాలతో గుర్తించిన వారిని ఏఎస్‌డీడీఓ కేటగిరీలో చేర్చారు. వీరి సంఖ్య దాదాపు 33 శాతంగా ఉంది. ఇంటింటి పరిశీలన సందర్భంగా ఢిల్లీలోని మొత్తం ఓటర్లలో 67.18 శాతం మంది గణన ఫారాలను డిజిటలైజ్ చేశారు. మిగిలిన 47.5 లక్షల మంది ఓటర్లను సేకరించలేని (ఫారాలు అందని) కేటగిరీలో ఏఎస్‌డీడీఓ కింద గుర్తించారు. అందువల్ల వారి పేర్లు ముసాయిదా జాబితాలో కనిపించలేదు. అయితే, ఎస్‌ఐఆర్ ప్రక్రియలో తమ ఫారాలు అందలేదని పేర్లు లేని ఓటర్లు.. దావాలు, అభ్యంతరాల ప్రక్రియ ద్వారా జాబితాలో తమ పేర్లను చేర్చుకోవడానికి అవకాశం కల్పించారు.
ఢిల్లీలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫారాల డిజిటలైజేషన్ శాతం కూడా గణనీయంగా మారింది. రోహిణిలో అత్యధికంగా 83.43 శాతం ఫారాలు డిజిటలైజ్ కాగా, తుగ్లక్‌బాద్‌లో అత్యల్పంగా 52.15 శాతం నమోదైంది. ఓటర్ల జాబితాను సిద్ధం చేయడంలో భాగంగానే ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) చేపట్టినట్లు అధికారులు తెలిపారు.











