
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం ఓ భవనం కూలిపోయింది. ఈ ఘటనలో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో భవనం కూలినట్లు సమాచారం అందగానే.. సహాయక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగించే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. శిథిలాల కింద ఎంతమంది చిక్కుకున్నారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఢిలీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌కు ఎదురుగా ఉండే ఈ భవనంలో ఎక్కువగా విద్యార్థులే ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రమాదానికి గురైన ఈ భవనాన్ని విద్యార్థుల పేయింగ్ గెస్ట్ హాస్టల్‌గా ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో దాదాపు 50 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం కావడంతో చాలా మంది గదుల్లోనే ఉన్నారు. భవనం కూలిపోవడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.













