
ఆదివారం ఐపిఎల్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు ఉర్విల్ పటేల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. కేవలం 13 బంతుల్లోనే అర్థ శతకం సాధించి.. ఐపిఎల్ చరిత్రలో అత్యంత వేగంగా అర్థ శతకం చేసిన ఆటగాడిగా యశస్వి జైస్వాల్ రికార్డును సమం చేశాడు. అయితే తన మెరుపు ఇన్నింగ్స్ వెనుక ధోనీ ఇచ్చిన ప్రోత్సాహం ఎంతో ఉందని ఈ యువ ఆటగాడు తెలిపాడు.
‘‘గత రెండు మ్యాచుల్లో నేను తొందరగా ఔటైన తర్వాత నేను డ్రెస్సింగ్ రూమ్‌లో మహీ భాయ్ పక్కన కూర్చున్నాను. ‘భయ్యా.. నాకు మంచి ఆరంభాలు లభిస్తున్నాయి. కానీ, నేను ఔటైపోతున్నాను. వాటిని పెద్ద స్కోర్లుగా మలచడానికి నేనేం చేయాలి?’ అని అడిగాను. దానికి మహీ భాయ్ నాతో ఒకే ఒక్క విషయం చెప్పారు. ‘నీ నైపుణ్యాల పట్ల నాకు ఎలాంటి సందేహమూ లేదు. ఏ సందేహం ఉన్నా అది కేవలం నీ మనసులోనే ఉంది. నువ్వు మానసికంగా స్పష్టతతో ఉంటూ బంతిని సరైన ప్రదేశాలకు కొట్టడానికి ప్రయత్నించు’’ అని ధోనీ సలహా ఇచ్చాడని ఉర్విల్ పేర్కొన్నాడు.














