
ప్రపంచంలో ఏ శక్తీ భారత్‌ను తలవంచేలా చేయలేదని, అణిచివేయాలని కూడా చూడబోదని ప్రధాని మోడీ అన్నారు. పోఖ్రాన్ అణు పరీక్షలను గుర్తు చేస్తూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. చారిత్రక సోమనాథ్ ఆలయం పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో నిర్వహించిన సోమనాథ్ అమృత్ మహోత్సవాల ముగింపు వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారంనాడు పాల్గొన్నారు. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన ప్రఖ్యాత సోమనాథ్ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి మోడీ ప్రసంగించారు. జాతీయ ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యత దక్కుతుందని, ఎలాంటి ఒత్తిళ్లు కూడా ఈ దేశాన్ని నీరుగార్చలేవని అన్నారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి నాయకత్వంలో భారతదేశం ఎలాంటి అంతర్జాతీయ ఒత్తిళ్లను కూడా లెక్కచేయలేదని, జాతీయ ప్రయోజనాలకే ఎప్పుడూ తొలి ప్రాధ్యానం ఉంటుందని చాటిచెప్పిందన్నారు.
సోమనాథ్ ఒక ఆలయం మాత్రమే కాదని, దేశ దృఢ సంకల్పానికి ప్రతీక అని అభివర్ణించారు. ధ్వంసం నుంచి నవనిర్మాణం వరకూ సోమనాథ్ ప్రయాణం చెక్కుచెదరని నాగరికతను ప్రతిబింబిస్తుందని, సర్దార్ పటేల్ విజన్‌కు ఇది మచ్చుతునక అన్నారు. సోమనాథ్ అమృత్ పర్వ్ కేవలం ఒక పండుగ కాదని, రాబోయే వెయ్యేళ్లు భారతదేశానికి స్ఫూర్తి అని చెప్పారు. సోమనాథ్ ఆలయంలో వేదమంత్రాల మధ్య అభిషేకం, ధ్వజ పూజ, మహాపూజలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమనాథ్ ఆలయం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అంతకుముందు ప్రధానమంత్రి హెలిప్యాడ్ నుంచి వీర్ హమీర్జీ సర్కిల్ వరకూ రోడ్‌షోలో పాల్గొన్నారు. సుమారు 1.5 కిలోమీటర్ల మేర జరిగిన ఈ రోడ్‌షోలో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. జెండాలు ఊపుతూ, నినాదాలు చేస్తూ సంప్రదాయ నృత్యాలతో దారిపొడవునా ప్రధానికి సాదర స్వాగతం పలికారు. కాగా, సోమనాథ్ ఆలయ ప్రాభవాన్ని గుర్తుచేస్తూ స్మారక స్టాంపు, నాణేన్ని ఈ ఉత్సవాల్లో ప్రధాని విడుదల చేశారు.















