తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసి సమ్మె కొనసాగుతోంది. బుధవారం ఉదయం నుంచి ఆర్టీసి బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ పలుచోట్ల డిపోల ముందు ఆర్టీసి కార్మికులు నిరసనలు చేపట్టారు. ఈక్రమంలో హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడలో వినూత్న నిరసన చేపట్టారు. బస్సు డిపో ముందు మహిళా కార్మికులు బతుకమ్మ ఆడుతూ.. నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను తెలియజేస్తూ.. ప్రభుత్వం వెంటనే స్పందించి వాటిని పరిష్కరించాలని కోరారు.

కాగా, ఆర్టీసి కార్మికులు సమ్మెకు దిగడంతో బస్సులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు, ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులను నడిపే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. ఇక, హైదరాబాద్ నగరంలో అద్దె బస్సులు యదావిధిగా నడుస్తున్నాయి. సమ్మెపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఆర్టీసి కార్మికులు సమ్మె విరమించి చర్చలకు రావాలని.. 29 డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.