
బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ జగిత్యాల బహిరంగ సభలో చెప్పిన పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టినవేనని బిజెపి ఎంపీ ధర్మపురి అర్వింద్ ధ్వజమెత్తారు. 72 ఏళ్ళ వయసులో కెసిఆర్ పచ్చి అబద్దాలు చెప్పారని ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో దుయ్యబట్టారు. ఫీజు రీయంబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ వంటి పథకాలకు బిల్లులు చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టారని ఆయన విమర్శించారు. పౌరసరఫరాల విభాగంలో అవినీతి, అక్రమాలు గతంలో కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. ఆ అవినీతిని ప్రస్తుత మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి కొనసాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్న బిఆర్‌ఎస్‌కు కోవర్ట్ అని విమర్శించారు.
రైతుల వద్ద నుంచి కరెంట్ బిల్లులు వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని ఎంపీ అర్వింద్ చెప్పారు. ఆదివాసీల పోడు భూములను బలవంతంగా తీసుకుంటున్నారని ఆయన విమర్శించారు. దీనిని ప్రశ్నిస్తే దౌర్జన్యాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణలో రైతులను ఆదుకోని కెసిఆర్ పంజాబ్‌కు వెళ్ళి రైతులకు చెక్కుల పంపిణీ చేయడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు తన పోరాటం ఆగదని, పసుపు రైతులకు క్వింటాల్‌కు రూ. ౩౦ వేలు ఇప్పించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భూముల ధరలకు దేశ వ్యాప్తంగా రెక్కలు వచ్చాయని ఎంపీ అర్వింద్ తెలిపారు.
తుపాకి రామునిలా.. ఎంపీ రఘునందన్ రావు
జగిత్యాలలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, భూపాల్‌పల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభల్లో తుపాకి రామునిలా డైలాగులు కొట్టారని బిజెపి ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పరస్పరం కాపాడుకుంటున్నాయని, నామమాత్రంగా విమర్శలు చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు.












