
కెసిఆర్ సభ జరుగుతుందని ముందే తెలిసి, ఆ సభకు పోటీగా అదే జిల్లాలో అదే సమయానికి రేవంత్ రెడ్డి మాట్లాడటం ఆయన కుచిత బుద్ధికి, సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం అని హరీష్‌రావు విమర్శించారు. కెసిఆర్ ప్రసంగం ఎప్పుడు ప్రారంభమవుతుందో చూసి అదే సమయానికి మైకు పట్టుకోవడం ముఖ్యమంత్రి స్థాయికి తగదు అని పేర్కొన్నారు. సోమవారం కెసిఆర్ ప్రసంగాన్ని 36 లక్షల మంది ప్రత్యక్ష ప్రసారంలో చూస్తే, రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని కేవలం 4 లక్షల మంది మాత్రమే చూశారని అన్నారు. కెసిఆర్ వ్యూవర్షిప్లో కనీసం 10 శాతం కూడా రేవంత్‌కు రాలేదని ఎద్దేవా చేశారు. బిఆర్ఎస్ పార్టీ అధికారిక లైవ్‌లో బిఆర్ఎస్ సభను 2 వేల మంది చూస్తే, కాంగ్రెస్ లైవ్‌లో కేవలం 54 మంది మాత్రమే ఉన్నారని అన్నారు. రెండున్నరేళ్లలో రేవంత్ స్థాయి ఎక్కడికి పడిపోయిందో, కెసిఆర్ మీద ప్రజల్లో ఉన్న అభిమానం ఏంటో ఈ లెక్కలే చెబుతున్నాయని వ్యాఖ్యానించారు.
పదేండ్లు రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రిగా కెసిఆర్ ఎంతో హుందాగా, రేవంత్ రెడ్డి పేరు ఒక్కసారి కూడా తీయకుండా రాష్ట్ర ప్రయోజనాలపై మాట్లాడితే..రేవంత్ రెడ్డి మాత్రం రాంకెలు వేయడం, ఏడవడం తప్ప ఇంకేం చేయలేదని చెప్పారు. రేవంత్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా మళ్లీ వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ జేజమ్మ దిగివచ్చినా దానిని ఆపలేరు అని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా కెసిఆర్ చెప్పిన మాటలు విని తప్పులు సరిదిద్దుకుంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కనీసం డిపాజిట్లు అయినా దక్కుతాయని అన్నారు. ఇప్పటికే రెండు సీజన్ల రైతు భరోసా ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి.. సోమవారం జగిత్యాల సభలో కెసిఆర్ గర్జిస్తారని భయపడి రాత్రికి రాత్రి ఒక ఎకరానికి కిస్తీ వేశారని చెప్పారు. కెసిఆర్ బయటకు వస్తే తప్ప రైతు భరోసా వేయరా..? అని ప్రశ్నించారు. పంట పెట్టుబడిగా ఇవ్వాల్సింది, పంట చేతికి వచ్చాక వేశారని తెలిపారు.












