మన తెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వ రం ప్రాజెక్టు నిర్మాణ పనుల లోపాలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కు విచారణ అర్హతను సవాల్ చేస్తూ హైకోర్టు దాఖలు అయిన పిటిషన్‌పై బు ధవారం కీలక తీర్పు వెలువడనున్నది. ఈ కమిషన్‌కున్న అర్హతలను సవాల్ చే స్తూ ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేసిన హరీశ్‌రావు హైకోర్టును ఆశ్రయించిన విషయంతెలిసిందే. జస్టిస్ పీసీ ఘోష్ నేతృ త్వంలోని కమిషన్‌ను ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని వారు హైకోర్టును కోరారు. కాగా కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఇదివరకే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం వెలువడే తీర్పు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా అధికార, ప్రతిపక్ష రాజకీయ వర్గాలలో ప్రాధా న్యం సంతరించుకుంది.

ఈ కేసులో కోర్టు వెలువరించే తీర్పు కాళేశ్వరం ప్రాజెక్టుపై తదుపరి పరిణామాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కుంగిన బ్యారేజీలు, ప్రాజెక్టు నిర్మాణం జరిగిన అవకతవకలపై జస్టిస్ పి.సి.ఘోష్ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం మార్చి 14, 2024న నియమించింది. కమిషన్ నియామకం, దానికున్న అర్హతలను సవాలు చేస్తూ కెసిఆర్, హరీశ్‌రావుతో పాటు ఐఎఎస్ అధికారులు స్మితా సభర్వాల్, మాజీ ఐఎఎస్ ఎస్.కె. జోషి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్‌ల బెంచ్‌‌‌‌ విచారణను తొలుత ఈ నెల 8కి , అనంతరం ఈ నెల 22కు వాయిదా వేసిన విషయం తెలిసిందే. కాగా పిటిషన్‌దారుల తరఫున సీనియర్ న్యాయవాది శేషాద్రి నాయుడు వాదనలు వినిపిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్‌‌‌‌ ఘోష్ కమిషన్‌‌‌‌ చేపట్టిన విచారణ ప్రక్రియలోని చట్టబద్ధమైన ఉల్లంఘనలు ఉన్నాయని తన వాదనలను గట్టిగా వినిపించారు. అలాగే సహజ న్యాయసూత్రాలను కమిషన్ పాటించలేదని కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

నేడు సుప్రీంకోర్టులో ‘ఓటుకు నోటు కేసు’ విచారణ

సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు కేసు’ బుధవారం సుప్రీంకోర్టులో విచారణకు రానున్నది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నందున రాష్ట్రంలోని ఎసిబి కోర్టులో విచారణ పారదర్శకంగా జరగదని, ఈ కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనున్నది.