
ప్రపంచ సాహిత్యం రచయితలు: మెహఫిల్ పాఠకుల కోసం మరో కొత్త శీర్షిక ప్రారంభం అవుతున్నది. భిన్నసంస్కృతులను, జీవన విధానాలను, ప్రాంతాలను, మానవుల సంఘర్షణలను, ఆశ నిరాశల వెతుకులాటలను, స్వప్నాలను అర్ధం చేసుకునేందుకు ప్రపంచ సాహిత్యం చదవడం ఎంతో అవసరం. ఆ సాహిత్యం మన చూపును మరింత విశాలం చేస్తుంది. నూతన భావాలను పరిచయం చేస్తుంది. పాఠకుల్ని సంస్కారవంతులైన మానవులుగా నిలబెడుతుంది. సుప్రసిద్ధ రచయిత ఎడ్వర్డ్ మోర్గాన్ ఫాస్టర్ గురించి, ఆయన 115ఏళ్ల క్రితం స్వలింగ సంపర్కంపై రాసిన మోరిస్ నవల గురించి ఎంతో ఆసక్తికరమైన అంశాలను ఈ వ్యాసం ప్రస్తావిస్తుంది. ఎడిటర్, మెహఫిల్.
ఇదొక అపురూపమైన ప్రేమ కథ. ఒక డ్రాయర్ సొరుగులో దాచిపెట్టిన కథ. అర్ధ శతాబ్దం పాటు రహస్యంగా ఉండిపోయిన కథ. ఐరోపా దేశాలు1914లో మొదటి ప్రపంచ యుద్ధంలో మునిగిపోయాయి. సరిగ్గా ఆ సంవత్సరంలోనే 35ఏళ్ల ఇంగ్లీష్ రచయిత ఎడ్వర్డ్ మోర్గాన్ ఫాస్టర్ ఓ నవల రాయడం ముగించాడు. ఆయన్ని సర్వ నాశనం చేయగల శక్తి ఆ కథకి ఉంది. ఒక యువకుడికి మరో యువకుడితో ఉన్న ప్రేమని ఫాస్టర్ అతి సున్నితంగా, మృదువుగా వివరించాడు. తనేంటో తెలుసుకున్నాక ధైర్యంగా సంతోషాన్ని వెతుకున్న యువకుడి కథ ఇది. 1914లో ఇంగ్లాండ్‌లో ఇలాంటి కథలు నిషిద్ధం. అవి వివాదాస్పదమే కాకుం డా రాసిన రచయితని సర్వ నాశనం చేసే అప్రతిష్టకి కారణం అవుతాయి. బ్రిటీష్ చట్టం ప్రకారం, ఇద్దరు పురుషుల మధ్య శారీరక సంబంధం, అశ్లీల చర్యగా పరిగణించి క్రిమినల్ నేరం కింద రెండేళ్లు కఠిన కారాగార శిక్ష వేస్తా రు. ఈ నేరం కిందే, ఆస్కార్ వైల్డ్ 1895లో రెండేళ్లు జైల్లో ఉన్నాడు. విడుదల అయ్యాక జైలు నుంచి తిన్నగా ఫ్రాన్స్‌కి వెళ్ళిపోయాడు. ఛిద్రమైపోయిన మనసుతో అజ్ఞాతంగా బతికి 1900లో మరణించాడు. ఫ్రాన్స్‌కి వెళ్ళిపోయాక మళ్ళీ ఇంగ్లాండ్ వైపు కన్నెత్తి చూడలేదు.
మరో పురుషుడితో సంబంధం ఉన్నట్టు అనుమానం కలిగినా, తెలిసినా అలాంటి యువకులు బ్లాక్ మెయిల్‌కి, అరెస్టుకి గురయి, నాశనం అయిపోయారు. జీవనోపాధి కోల్పోయారు. కన్న కొడుకుల్ని తల్లిదండ్రులు బహిష్కరించారు. సమాజం గురిచేసిన మానసిక క్షోభని తట్టుకోలేక కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఫాస్టర్ ‘మోరిస్’ రాశాడు. అప్పుడే ముగించిన ఆ రచనని చూస్తూ ఒక నిర్ణయానికి వచ్చాడు. దాన్ని భద్రం గా డ్రాయర్ సొరుగులో పెట్టి తాళం వేసేశాడు. అది అట్లా ఆ సోరుగులోనే 57 సంవత్సరాలు ఉండిపోయింది.
మోరిస్ కథ ఏంటంటే.. మోరిస్ హాల్ అనే ఒక మధ్య తరగతి యువకుడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లో చదువుతూ ఉంటాడు. అక్కడ తన క్లాస్మేట్ క్లైవ్ దరహామ్తో ప్రేమలో పడతాడు. ఇద్దరి మధ్య ప్రేమ సాగినా, కొంత కాలం తర్వాత క్లైవ్ అతన్ని దూరం పెట్టి, సమాజ సంప్రదాయం ప్రకారం అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. చదువు పూర్తి అయ్యాక, అలెక్ స్కడ్డర్ కలుస్తాడు. అతన్ని కలిశాక మోరిస్ జీవితం మలుపు తిరుగుతుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. కొత్త జీవితం ప్రారంభించడానికి సమాజం నుంచి దూరంగా పారిపోతారు.
కథ సుఖంతంగా ముగుస్తుంది, కానీ అది 1914లో సాధ్యమయ్యే విషయం కాదు. తమ ప్రేమను అంగీకరించని సమాజం నుంచి ఇద్దరు యువకులు సంతోషాన్ని వెతుక్కుంటూ దూరంగా వెళ్లిపోయారని కథని సుఖాంతం చేశాడు. కథకి ఎంతో ఆశాభావంతో ముగింపు ఇచ్చినా దాన్ని డ్రైవర్ సొరుగులోనే దాచాడు. 1914 నాటికి ఫాస్టర్కి మంచి రచయితగా పేరు ఉంది. ‘ఏ రూమ్ విత్ ఏ వ్యూ’, ‘హా వరడ్స్ ఎండ్’ అప్పటికే అచ్చయ్యాయి. ఈ రెండు నవలలు, అప్పటి సమాజం గురించి, సమాజంలో తారతమ్యాలు, హెచ్చుతగ్గులు, మనుషుల మధ్య సంబంధాల గురించి అద్భుతంగా విశదీకరిస్తాయి. ఆయన జీవితం సాహితీపరుల మధ్య, సమాజంలో బాగా పలుకుబడి గల వారి మధ్యే సాగుతూ ఉండేది. పరపతిని కాపాడుకోడానికి తప్పనిసరై తన సొంత స్వలింగ సంపర్కాల్ని బయటి ప్రపంచం నుంచి రహస్యంగా ఉంచాడు. కాకపోతే, దగ్గరి స్నేహితుల నుంచి ఈ విషయం దాచలేదు. చాలా మందితో సంపర్కాలు కొనసాగించాడు. ఓ విధంగా చెప్పాలంటే, స్నేహితుల మధ్య ఇది బహిరంగ రహస్యంగానే ఉండింది.
అయినా సరే, ఒకవేళ ‘మోరిస్’ని ప్రచురిస్తే ఆయన జీవితం కుప్ప కూలిపోయేది. స్వలింగసంపర్కుడుగా ముద్రపడి ఆస్కార్ వైల్లాగానే శిక్షకి గురయ్యేవాడు. ఆయన రచనలన్నీ బహిష్కరణకి గురయ్యేవి. అందుకే ‘మోరిస్’ని బ్లూమ్స్‌బరి గ్రూపులో స్నేహితులకి మాత్రమే చూపించాడు. అయన లాగానే స్వలింగసంపర్కుడు, స్నేహితుడు క్రిస్టఫర్ ఇషర్‌వుడ్, మరో స్నేహితుడు లిటెన్ స్నేచి మాత్రం చదివారు. ‘మోరిస్’ ఎంత అపురూపమైన రచనో అంత ప్రమాదకరమైంది కూడా గ్రహించి వాళ్ళిద్దరూ కూడా ఆ రచన రహస్యాన్ని కాపాడారు. వీళ్లిద్దరూ తప్ప మిగిలిన ప్రపంచం ‘మోరిస్’ని చూడలేదు. 1924లో ‘ఏ పాసేజ్ టు ఇండియా’ ప్రచురితం అయ్యాక ఫాస్టర్కి ఇంగ్లాండులో అతి గొప్ప రచయితల్లో ఒకడుగా గుర్తింపు వచ్చింది. ఎన్నో వ్యాసాలు, విశ్లేషణలు, సాంస్కృతిక వ్యాఖ్యానాలు రాసి, సామాజిక మేధావిగా ప్రశంసలతో బాటు ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. ఆ పేరుని పోగొట్టుకోలేక తన రహస్యాన్ని తనలోనే దాచుకున్నాడు.
1917 వరకు ఫాస్టర్కి స్వలింగ సంపర్కం అనుభవం కాలేదు. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలంలో తన 38వ ఏట ఆయన ఈజిప్ట్‌లో పనిచేశాడు. అక్కడ ట్రామ్ కండక్టర్ మహమ్మద్ అదిల్‌తో గాఢమైన సం బంధం ఏర్పడింది. కానీ ఎంతో కాలం అది నిలవలేదు. ఆ మరుసటి సంవత్స రం అదిల్ ఒక అమ్మాయిని వివాహం చేసుకోవడంతో వారి మధ్య బాంధ వ్యం ఆగిపోయింది. బాంధవ్యం లేకపోయినా వారిద్దరి మధ్య అనురాగం మాత్రం చెదరలేదు. అదిల్ తన కొడుకుకి మోర్గాన్ పేరు పెట్టుకున్నాడు. 1919లో ఫాస్టర్ ఇంగ్లండ్ తిరిగి వచ్చేశాడు. 1922లో అదిల్ అనారోగ్యంతో చనిపోయాక ఆయన భార్య ఫాస్టర్కి అదిల్ ఉంగరాన్నిపంపింది. అది ఆయనతో జీవితాంతం ఉంది. ఈజిప్ట్‌లో అదిల్‌తో తన స్వలింగ సంపర్కం విషయం బయటికి రాకుండా జాగ్రత్త పడ్డాడు. ఫాస్టర్ తల్లి లిల్లీ కొడుకుతోనే కలిసి జీవించింది. ఫాస్టర్ చిన్నతనంలోనే లిల్లీ బతికి ఉన్నంతకాలం, ఆమె అదుపులోనే ఉండడం వల్ల, సొంత జీవితం లేకుండా, తనేంటో చెప్పలేక, బాధాకరమైన అయోమయంలో, అసంతృప్తితోనే ఆయన జీవితం సాగింది. 1930లో ఆయనకి 28ఏళ్ళ పోలీసు బాబ్ బకింగ్ హమ్‌తో పరిచయం కలిగింది. ఆ పరిచయం ప్రేమకి దారి తీసింది. వాళ్ళ బంధం భావోద్యేగం, అనురాగం, అన్యోన్యం, ఆత్మీయంతో పెనవేసుకున్న ప్రేమగా, మాటలకి అతీతంగా పెనవేసుకుంది.
రెండేళ్ల తర్వాత బాబ్ మేరీ హాకీ అనే అమ్మాయిని పెళ్ళిచేసుకున్నా కూడా వాళ్ళ బంధం తెగలేదు. అప్పటి సంప్రదాయాలకి, సామాజిక కట్టుబాట్లకి విరుద్ధంగా ఈ త్రయం పరస్పర అసూయ, ఉద్రిక్తతల మధ్య జీవనం కొనసాగించారు. బాబ్ ఇద్దర్ని సమానంగా, అమితంగా ప్రేమించాడు. తన భర్త ప్రేమని ఫాస్టర్‌తో పంచుకోవడం మేరీకి ఇష్టం లేక పోయింది. అట్లాగే, బాబ్ మీద మేరీకి ఉన్న వైవాహిక హక్కుని ఫాస్టర్ సహించలేకపోయాడు. అయినా ముగ్గురూ తమ సంబంధాన్ని గోప్యంగా ఉంచారు. ఒకవేళ ఈ విషయం బయట పడితే, ముగ్గురు కఠిన కారగార శిక్షకు గురయ్యేవారు. కొంతకాలం తరువాత మేరీ,ఫాస్టర్ల మధ్య అవగాహన పెరిగి మంచి స్నేహితులుగా మారారు. ఫాస్టర్ వాళ్లిద్దరితో కలిసి 40 ఏళ్లు జీవించాడు. బాబ్, మేరీ తమ కొడుకుకి రాబర్ట్ మోర్గాన్ అని పేరు పెట్టున్నారు. రాబర్ట్‌కి ఫాస్టర్ రెండో తండ్రిలా నిలబడ్డాడు. 1961లో ఫాస్టర్ తరచూ గుండె నొప్పితో బాధ పడుతుంటే, మేరీ ఆయన్ని తమ ఇంట్లోనే ఉంచుకుని బాగోగులు చూసుకుంది.
ఫాస్టర్ తల్లి లిల్లి 1945లో చనిపోయాక పరిస్థితులు మారాయి. తన దగ్గరి స్నేహితులతో ఇంకాస్త స్నేహంగా ఉండడం మొదలెట్టాడు. మునపటి భయం తగ్గినా మోరిస్ నవలని అచ్చువేయలేకపోయాడు. బ్రిటీష్ చట్టంలో ఎలాంటి మార్పు లేకపోవడంతో ధైర్యం చెయ్యలేదు. తను చనిపోయిన తర్వాత కూడా బ్రిటీష్ చట్టం మారినప్పుడే మోరిస్ నవలను అచ్చువేయాలని అవధి, నిబంధనను మోరిస్ నవలకి 1960లోనే చేర్చాడు. ఆయన బతికుండగా ఆ చట్టం మారలేదు. అయితే, 1953లో న్యూ స్టేట్స్ మ్యాన్ అండ్ నేషన్ అనే పత్రికకి రాసిన వ్యాసం లో స్వలింగసంపర్కుల విషయంలో అమలులో ఉన్న దారుణమైన చట్టాన్ని మార్చవలసిన అవసరం ఉందని, స్పష్టంగా వాదించాడు. 1967లో ఫాస్టర్ 88 ఏళ్ల వయసులో ఉన్నపుడు, బ్రిటీష్, వేల్స్ స్వలింగ సం పర్కం చట్టంలో మార్పు వచ్చింది. ఈ మార్పు ప్రకారం, స్వలింగ సంపర్కం కఠిన కారగార శిక్ష పడవలసిన నేరం కాదు. కాకపోతే కొత్తగా చేసిన మార్పుకి ఒక నిబంధన జత చేశారు. అదేంటంటే, ఈ కొత్త చట్టం 21 సంవత్సరాలు దాటిన వారికి, అదీ, తమ సంబంధాన్ని గుట్టుగా ఉంచిన వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది.
ఫాస్టర్ 91వ ఏట 1970లో జూన్ 7న మరణించాడు. చివరి వరకు తనదైన శైలిలో తను ప్రేమించిన బాబ్, మేరీల సాన్నిధ్యంలో ప్రాణం విడిచాడు. 1975లో బాబ్ చనిపోయాక వారిద్దరి చితా భస్మాలని కలిపి మేరీ గులాబీ తోటలో చల్లింది. ఒక సంవత్సరం తరవాత ,అంటే అది రాసిన 57 సంవత్సరాల తరవాత, మోరిస్ నవల అచ్చయింది. సాహితీ లోకం ఖంగుతింది. ఒక గొప్ప రచయత రాసిన నవల 57 సంవత్సరాల తరవాత అచ్చయ్యేసరికి అందరూ అవాక్కయ్యారు. అసలు అలాంటి నవల ఫాస్టర్ రాశాడా అని నిర్ఘాంతపోయారు. మోరిస్ మీద వివిధ రకాల విమర్శలు వెలువడ్డాయి. కొందరు ఇది పాత కధ అని పెదవి విరిచారు.ఇంకొందరు, సామాజిక పరిస్థితులకి అనుగుణంగా ఉందన్నారు. మోరిస్‌తో బాటే ఫాస్టర్, స్వలింగ సంపర్కం మీద రాసిన కధల సంపుటి ‘ది లైట్ టు కమ్’ కూడా పాపులర్ అయ్యిం ది. ఫాస్టర్ తన లైంగిక ప్రాధాన్యతల్ని తన స్నేహితుల ముందు ఎప్పుడూ దాచలేదు. కాకపోతే బాహాటంగా ఎప్పుడూ ఎక్కడా ఆ విషయం ప్రస్తావించలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అదొక బహిరంగ రహస్యంగా ఉండింది! స్నేహితుల అనుభవాలు, తన సొంత అనుభవాలు ఈ నవలకి మూలం అయ్యాయి. ఆ రోజుల్లో స్వలింగ సంపర్కుల కోసం పోరాడిన ఎడ్వర్డ్ కార్పెంటర్‌తో స్నేహం ఫాస్టర్ ఈ నవల రాయడానికి ప్రోత్సహించి పునాది వేసింది. సామాజిక విషయాల మీద స్పందించే కవి, దార్శినికుడు అయిన ఎడ్వర్డ్ కార్పెంటర్ని అతని ప్రేమికుడు అయిన జార్జ్ మిల్లర్‌ని, ఫాస్టర్ 1913లో మొదటిసారి కలిసాడు. వాళ్లిద్దరి జీవితం ఆధారంగానే ‘మోరిస్’ నవలను రాశాడు. లేడీ చాటర్లీస్ లవర్ నవల, డి.హెచ్. లారెన్స్ ఈ నవల చదివాకే రాశాడు.
ఎన్నో విషయాల మీద ధైర్యంగా రాసి ప్రపంచం ముందు ఉంచినా, తను అ మూల్యం, అతి ముఖ్యం అని భావించిన అంశం మీద రాసిన నవలని మా త్రం దాచిపెట్టాడు. దాచిపెట్టాడే కానీ మాయం చెయ్యలేదు. మోరిస్‌ను ఆహ్వానించే ప్రపంచం కోసం ఆశగా ఎదురు చూస్తూ, ఆ రోజు కోసం జాగ్రతగా దాచిపెట్టాడు. అలాంటి ప్రపంచం ఆయనకి దొరకడం ఒక జీవితకాలం ఆల స్యం అయ్యింది. కానీ ఆయన లాంటి ఎంతో మందికి ఆలస్యం కాలేదు. ఆ యన అక్షరాలు వాళ్ళ కోసం డ్రాయర్ సొరుగులో ఎదురుచూస్తూ ఉన్నాయి. ఫాస్టర్ భయంతో బతికేశాడు. తన ప్రేమని దాచిపెట్టాడు. ఎంతో అపురూపంగా ఎంచిన నవలని అచ్చులో చూడకుండానే కన్ను మూశాడు. ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు స్వేచ్ఛగా చదువుతారనే నమ్మకంతో రాసిన నవల ఇది. వెళుతూ చీకటిలో దీపాన్ని వెలిగించాడు. సంతోషంగా జీవించే హక్కు, కోరుకున్న వాళ్ళని ప్రేమించే అర్హత ఉన్నాయని, నిర్ధాక్షణ్య చట్టాల వల్ల, సమాజం గురిచేసే అవమానాలతో జీవితం నాశనం చేసుకొనవసరం లేదని చెప్పాడు. స్వలింగ సంపర్కులకి ధైర్యం ఇచ్చిన రచయత ఎడ్వర్డ్ మోర్గాన్ ఫాస్టర్. తనకి దక్కని జీవితం ఇతరులు జీవించాలని ఆశించిన రచయత ఎడ్వర్డ్ మోర్గాన్ ఫాస్టర్.

- ఒక ఆంగ్ల ఆర్కేవ్స్‌లో వచ్చిన వ్యాసానికి అనువాదం
సుషమ దండమూడి














