
మన తెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. ఆదివారం హైదరాబాద్ కొండాపూర్‌లోని ఆయన నివాసంలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి తరలించారు. ఇదే కేసులో కారుమూరి కుమారుడు సునీల్‌ను ఈ ఏడాది జూన్ 16న అరెస్ట్ చేశారు.
ఈ దందాలో సునీల్ కీ రోల్ పోషించారని, ఆయన ఖాతాల్లోకి దాదాపు రూ. 28 కోట్ల మేర కిక్బ్యాక్స్ వచ్చాయని ఈడీ రిమాండ్ నివేదికలో వెల్లడించింది. సునీల్ ను విచారిస్తుండగానే.. కారుమూరిని కూడా అరెస్ట్ చేయడంతో ఈ స్కామ్ లో మరికొందరి పేర్లు బయటపడే ఛాన్సున్నట్లు తెలుస్తోంది. తండ్రి పలుకుబడిని ఉపయోగించుకుని సునీల్ భారీగా అవకతవకలకు పాల్పడినట్లుగా ఈడీ అధికారులు చెప్తున్నారు.
ఈ క్రమంలోనే కారుమూరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసును ఈడీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. టెండర్లలో అక్రమాలు, నగదు లావాదేవీలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో వాసుదేవరెడ్డి, రాజ్ కేసిరెడ్డి, కారుమూరి కుమారుడు సునీల్‌కుమార్ ఉన్నారు. టెండర్లలో సిగ్మా సప్లయ్ చైన్ సొల్యూషన్స్‌ను ఫ్రంట్ కంపెనీగా ఉపయోగించినట్టు ఈడీ అనుమానిస్తోంది.. హవాలా లావాదేవీలపై కూడా ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది.








