విద్య అనేది ఒక వ్యక్తి జీవితాన్ని మాత్రమే కాదు.. ఒక కుటుంబం భవిష్యత్తును, సమాజం అభివృద్ధిని మార్చగల శక్తి. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తే వారి జీవితాల్లో పెనుమార్పు వస్తుంది. ఈ ఆలోచనతోనే తెలంగాణలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, గురుకులాలు, ఉన్నత విద్యా సంస్థల్లో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు విద్యా ప్రమాణాలను పెంచేందుకు చర్యలు చేపడుతోంది. ఈ ప్రయత్నాలకు సాంకేతికతను జోడిస్తూ టి-శాట్ చేస్తున్న కృషి మరింత ప్రాధాన్యత సంతరించుకుంటోంది. విద్యార్థి విద్యా పునాదులు పాఠశాల స్థాయి నుండే బలోపేతం కావాలనే లక్ష్యంగా ప్రభుత్వం పలు సంస్కరణలు చేపడుతుంటే అదే బాటలో పయనిస్తూ ఇటీవల టి-శాట్ కూడా స్కూల్ ఎడ్యుకేషన్‌తో ప్రసారాలపై ఎంఒయు కుదుర్చుకోవడం శుభపరిణామం.

ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థికి కూడా ప్రైవేట్ విద్యాసంస్థలో చదివే విద్యార్థితో సమానమైన నాణ్యమైన విద్య అందాలన్నదే ప్రభుత్వ విద్యా వ్యవస్థ లక్ష్యం కావాలి. అయితే తరగతి గదిలో మంచి బోధనతో పాటు పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ, మోడల్ పరీక్షలు, ప్రాక్టీస్ టెస్టులు, కెరీర్ మార్గదర్శకత్వం కూడా అవసరమవుతోంది. ఈ అవసరాన్ని గుర్తించి తమ కార్యక్రమాలను క్రమంగా విస్తరిస్తున్న టి-శాట్ ఇటీవల నిర్వహించిన ఎప్‌సెట్ డిజిటల్ కోర్సు ఇందుకు మంచి ఉదాహరణ. ఇందులో భాగంగా 112 రోజుల పాటు 450 అకడమిక్ మాడ్యూల్స్‌ను ప్రసారం చేసి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ వంటి ప్రధాన సబ్జెక్టులపై నిపుణులతో డిజిటల్ పాఠాలను అందించింది. టివి ప్రసారంతోపాటు డిజిటల్ వేదికల ద్వారా కూడా విద్యార్థులకు ఈ కంటెంట్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది. ఇక్కడ టి-శాట్ ప్రత్యేకత కేవలం పాఠాలు చెప్పడంలోనే లేదు. విద్యార్థులు పరీక్షకు సిద్ధమయ్యే విధంగా మోడల్ పరీక్షలు, ప్రాక్టీస్ ప్రశ్నలు, సబ్జెక్ట్ వారీగా పరీక్షా సన్నద్ధత, పరీక్షా విధానంపై అవగాహన వంటి అంశాలను కూడా అందుబాటులోకి తీసుకురావడం ముఖ్యమైన పరిణామం. ప్రవేశ పరీక్షలకు సన్నద్ధం అయ్యేందకు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్లలేని విద్యార్థులకు ఇలాంటి ఉచిత డిజిటల్ కంటెంట్ ఎంతో ఉపయోగకరం. ఎప్‌సెట్‌తోపాటు జెఇఇ, మెయిన్స్, పాలిసెట్, గురుకుల సెట్, పిజి సెట్, గ్రూప్స్, ఎస్‌ఎస్‌సి, ఆర్‌ఆర్‌బి, పోలీస్ ఉద్యోగాలు, డిఎస్‌సి, టెట్, వంటి వివిధ పోటీ పరీక్షలకు కూడాటి-శాట్ ప్రత్యేక కార్యక్రమాలను అందిస్తోంది. ఒక విద్యార్థి పాఠ్యాంశాలను నేర్చుకోవడంతోపాటు మోడల్ ప్రశ్నలను సాధన చేసి, పరీక్షను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుకునేలా ఈ కార్యక్రమాలను మరింత విస్తరించడం అభినందనీయం.

ఆగస్టు 22న పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్, టి-శాట్ సిఇఒ వేణుగోపాల్ రెడ్డి మధ్య కుదిరిన ఒప్పందం పాఠశాల విద్యా వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఈ ఎంఒయు ద్వారా 9, 10 తరగతుల విద్యార్థులకు సాయంత్రం వేళల్లో డిజిటల్ పాఠాలను టి-శాట్ ద్వారా ప్రసారం చేయనుండడంతో పాఠశాలలో ఉపాధ్యాయులు బోధించిన పాఠాలను విద్యార్థులు ఇంటికి వెళ్లిన తర్వాత కూడా పునశ్చరణ చేసుకునే అవకాశం లభిస్తుంది. అంతేకాదు రాష్ట్రంలోని సుమారు 28 వేల పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులతో ముఖ్యమంత్రి నిర్వహించే ముఖాముఖి కార్యక్రమాలు, ‘మా జిల్లా- మా పాఠశాల’, ఉపాధ్యాయుల కోసం నిర్వహించే టిఎల్‌ఎం మేళాలు, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ కార్యక్రమాలు కూడా టి-శాట్‌లో ప్రసారమవుతాయి. టి-శాట్ పాఠాలు చెప్పడమే కాకుండా పాఠశాలలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రభుత్వం మధ్య విద్యా వారధిగా మారనుండడం గొప్ప విషయం. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌తో తాజా ఎంఒయు గొప్ప ముందడుగు. ముఖ్యంగా 9, 10 తరగతుల విద్యార్థులకు సాయంత్రం డిజిటల్ తరగతులు అందుబాటులోకి రావడం వల్ల పదో తరగతి పరీక్షలకు ముందస్తు సిద్ధంగా విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అదే సమయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాలల మధ్య సమన్వయాన్ని పెంచే కార్యక్రమాలను కూడా టి-శాట్ ద్వారా విస్తృతంగా ప్రసారం చేయడం వల్ల విద్యా వ్యవస్థలో భాగస్వామ్య భావన పెరుగుతుంది.

ఈ పరిణామాలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వ విద్యా దృక్పథానికి డిజిటల్ బలాన్ని అందించే పరిణామంగా చెప్పుకోవచ్చు. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, తరగతి గదులు, ప్రయోగశాలలు, డిజిటల్ సదుపాయాలు, బోధనా ప్రమాణాలను మెరుగుపర్చడం, బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలు చేయడం వంటి చర్యలతో ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తుంటే. మరోవైపు టి-శాట్ నాణ్యమైన డిజిటల్ పాఠాలను విద్యార్థుల ఇళ్లకు చేరవేస్తోంది. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో పోటీ పరీక్షలకు శిక్షణ పొందాలంటే వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు అదనంగా ప్రయాణం, వసతి వంటి ఖర్చులు భరించాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో టి-శాట్ ద్వారా నిపుణుల బోధన, డిజిటల్ కోర్సులు, మోడల్ పరీక్షలు, ప్రాక్టీస్ మెటీరియల్ అందుబాటులోకి వస్తే ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. ఒక విద్యార్థికి ఖరీదైన మోడల్ టెస్ట్ సిరీస్ కొనుగోలు చేసే స్థోమత లేకపోయినా టి-శాట్ అందించే డిజిటల్ పరీక్షా కార్యక్రమాలు ఉపయోపడుతాయి. సిఇఒ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో టి-శాట్ వివిధ విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థలు, విద్యా సంస్థలతో అవగాహన ఒప్పందాలను పెంచుకోవడం ప్రభుత్వ విద్య బలోపేతానికి సానుకూలంగా మారుతున్నాయి.

ఇటీవల మహాత్మాగాంధీ యూనివర్శిటీతో కుదిరిన ఎంఒయుతో ఆన్ లైన్‌లో విద్యా అవకాశాలను విస్తరించేందుకు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం అంటే కేవలం కొత్త భవనాలు నిర్మించడం కాదు. నాణ్యమైన ఉపాధ్యాయులు, ఆధునిక బోధనా విధానాలు, డిజిటల్ కంటెంట్, పరీక్షా సన్నద్ధత, మోడల్ పరీక్షలు, కెరీర్ మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల భాగస్వామ్యం.. ఇవన్నీ కలిసినప్పుడే ప్రభుత్వ విద్యకు సంపూర్ణ రూపం వస్తుంది. ఈ మొత్తం వ్యవస్థలో టి-శాట్ ముఖ్య భూమిక పోషిస్తూ డిజిటల్ భాగస్వామిగా ఎదుగుతోంది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలనే ప్రభుత్వ సంకల్పానికి టి-శాట్ తన డిజిటల్ సామర్థ్యాన్ని జోడించడం మంచి పరిణామం. ప్రభుత్వ పాఠశాల భవనం విద్యార్థికి తరగతి గదిని అందిస్తే.. టి-శాట్ ఆ తరగతి గది పరిధిని ఇంటి వరకు విస్తరిస్తోంది. పాఠశాల ఉపాధ్యాయుడి బోధనకు డిజిటల్ పునశ్చరణను జోడిస్తోంది. పేద విద్యార్థికి ఖరీదైన కోచింగ్‌కు ప్రత్యామ్నాయాన్ని అందిస్తోంది. పోటీ పరీక్షల అభ్యర్థికి ప్రాక్టీస్ అవకాశాలను కల్పిస్తోంది.

టి-శాట్‌ను కేవలం ఒక టెలివిజన్ ఛానల్‌గా చూడటం సరైంది కాదు. ఇది పేద విద్యార్థికి ఉచిత డిజిటల్ కోచింగ్ సెంటర్.. గ్రామీణ విద్యార్థికి నాణ్యమైన విద్యా వేదిక.. పోటీ పరీక్షల అభ్యర్థికి మార్గదర్శి.. ప్రభుత్వ విద్యకు సాంకేతిక బలం.. విద్యార్థి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వం మధ్య డిజిటల్ వారధి. పోటీ పరీక్షలకు ఆర్థిక పరిస్థితులు అడ్డంకి కాకూడదు.. ప్రతిభకు సమాన అవకాశాలు లభించాలి. ఈ లక్ష్యాల సాధనలో టి-శాట్ విప్లవాత్మక నిర్ణయాలతో ముందడుగు వేస్తోంది. తెలంగాణలో పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లల భవిష్యత్తుకు నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంలో టి-శాట్ మరింత బలమైన భాగస్వామిగా ఎదగడం ఖాయం.


ఐ.వి.మురళీకృష్ణ శర్మ