
ఊర్కొండ కాంగ్రెస్ నాయకుల ధ్వజం
భూకబ్జాలకు బీఆర్ఎస్ నాయకులు అడ్డాగా మారారు
విజయ డైరీ అక్రమాలను బయటపెడతాం.. జాగ్రత్త బిడ్డ!
కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఆయుబ్ పాషా
సర్పంచుల సంఘం అధ్యక్షుడు జరుపులావత్ రమేష్ నాయక్
మన తెలంగాణ/ఊర్కొండ: జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న బిఆర్ఎస్ నాయకులకు ఊర్కొండ మండల కాంగ్రెస్ నాయకులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. బురదలో రాయి వేస్తే అది మీ మీదనే పడుతుంది.. ఎమ్మెల్యేని విమర్శించే ముందు మీ గతాన్ని, మీ స్థాయిని ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి" అని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ఎండి. ఆయూబ్ పాషా, మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు జె రమేష్ నాయక్ మండిపడ్డారు.
సోమవారం ఊర్కొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు బిఆర్ఎస్ పదేళ్ల వైఫల్యాలను, అక్రమాలను ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
భూకబ్జాల పర్వం - బీఆర్ఎస్ ఘనకార్యం
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జడ్చర్ల నియోజకవర్గంలోని ప్రతి మండలం భూకబ్జాలకు నిలయంగా మారిందని వారు ఆరోపించారు. వందల ఎకరాల ప్రభుత్వ, పేదల భూములను బిఆర్ఎస్ నాయకులు అడ్డగోలుగా కబ్జా చేసింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఊర్కోండ మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో భూకబ్జాలకు పాల్పడి, కోట్లకు పడగలెత్తింది మీ నాయకులు కాదా అని నిలదీశారు.
కొబ్బరికాయల మంత్రి - అసమర్థ పాలన
"రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉండి కూడా, సొంత నియోజకవర్గంలోని మండల కేంద్రంలో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) ఏర్పాటు చేయలేని అసమర్థత బిఆర్ఎస్ ది అని దుయ్యబట్టారు. కేవలం కొబ్బరికాయలు కొట్టడానికే పరిమితమైన మిమ్మల్ని ప్రజలు 'కొబ్బరికాయల మంత్రి' అని పిలుచుకుంటున్న విషయం మర్చిపోయారా?" అని ఎద్దేవా చేశారు. పదేళ్లలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టలేదు, దళిత బంధులోనూ అక్రమాలేనని ధ్వజమెత్తారు.
విజయ డైరీ అక్రమాలపై హెచ్చరిక
విజయ డైరీలో జరుగుతున్న భారీ అక్రమాల వెనుక బిఆర్ఎస్ కీలక నాయకుల హస్తం ఉందని, రైతులను ముంచిన చరిత్ర బిఆర్ఎస్ నాయకులదని ఆరోపించారు. "నీ అక్రమాల చిట్టా మా దగ్గర ఉంది, త్వరలోనే అన్నింటినీ బయటపెడతాం.. జాగ్రత్త బిడ్డ!" అంటూ ఘాటుగా హెచ్చరించారు.
మూడేళ్లలోనే అభివృద్ధి బాటలో కాంగ్రెస్
ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఈ విమర్శలు చేస్తున్నారని వారు పేర్కొన్నారు. ప్రతి గ్రామానికి 20 చొప్పున ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేశామని, మౌలిక సదుపాయాలు: మహిళా సంఘాల భవనాలు, సీసీ రోడ్లు, బీటీ రోడ్ల నిర్మాణానికి భారీగా నిధుల కేటాయించామని, రేవల్లి, ఊరుకొండ పేటలో లో-వోల్టేజీ సమస్యను పరిష్కరించేందుకు రెండు సబ్ స్టేషన్ల ఏర్పాటుకు శంకుస్థాపనలు చేశామని, పదేళ్లుగా పెండింగ్లో ఉన్న రేషన్ కార్డులను అర్హులైన ప్రతి కుటుంబానికి అందిస్తున్న ఘనత మా ప్రభుత్వానిదని ప్రశంసించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ దశలవారీగా నెరవేరుస్తుందని, ఇకనైనా బిఆర్ఎస్ నాయకులు తమ చిల్లర రాజకీయాలు మానుకొని ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. లేనిపక్షంలో ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలువురు సర్పంచులు, ఉప సర్పంచులు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.













