
న్యూఢిల్లీ: గృహహింస కేసు విచారణలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్యను భర్త పశువులా చూడకూడదని.. ఆమెకు గౌరవంతో జీవించే హక్కు ఉందని తెలిపింది. గృహహింస ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ముందస్తు బెయిల్ కోసం వేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు విచారించింది. అనంతరం అతడి అభ్యర్థనను తిరస్కరించింది.
నిందితుడు మద్యం మత్తులో దాడి చేశాడని బాధితురాలి తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. నేలపైకి తోయడంతో ఇటుక తగిలి బాధితురాలి తలకు గాయమైంది. ఆ తర్వాత కర్రతో కూడా దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. మరోవైపు నిందితుడు మూడు వివాహాలు చేసుకోగా.. న్యాయస్థానాన్ని ఆశ్రయించిన బాధితురాలు మొదటి భార్య. వాదనలు విన్న న్యాయస్థానం.. ‘‘మీరు మీ భార్యను ఎందుకు కొట్టాలనుకున్నారు..? ఇలాగే వేధిస్తే.. ఆమె మిమ్మల్ని వదిలి వెళ్లిపోతుంది. రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోండి’’ అంటూ ముందస్తు బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది.














