మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేలా అంతర్రాష్ట్ర జల వివాదాలపై గట్టిగా వాదించాలని ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేసినట్టుగా తెలిసింది. సెప్టెంబర్ 01వ తేదీన తుమ్మిడిహట్టిపై ఢిల్లీలో జరగనున్న అధికారుల భేటీ, సెప్టెంబరుర్ 7వ తేదీన సీడబ్ల్యూసీ హైలెవెల్ కమిటీ సమావేశం ఎజెండాల గురించి అధికారులతో సిఎం రేవంత్‌రెడ్డి చర్చించినట్లుగా సమాచారం. ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డిలో నీటిపారుదల శాఖపై సిఎం రేవంత్‌రెడ్డి అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహంచారు. ఈసమీక్షలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మహారాష్ట్ర, ఏపితో ఉన్న జల వివాదాలపై అధికారులు, న్యాయవాదులు తెలంగాణ వైఖరిని స్పష్టంగా వినిపించాలని సిఎం రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా అధికారుల కు సూచించినట్లుగా సమాచారం. దీంతోపాటు సుప్రీంకోర్టు, కేంద్ర జలవనరుల సంఘం, కృష్ణా, గోదావరి నదీ జలాల నిర్వహణ బోర్డుల్లో ఉన్న వివిధ కేసుల గురించి ముఖ్యమంత్రి ఆరా తీసినట్టుగా తెలిసింది. ఆ కేసులు ఏ దశలో ఉన్నాయి, ఇతర రాష్ట్రాల వాదనలు ఎలా ఉన్నాయి, తెలంగాణ ప్రయోజనాలపై ఎలాంటి చర్యలు చేపట్టాలన్న అంశాలపై సిఎం ఆరా తీసినట్లుగా సమాచారం.


దీంతోపాటు సెప్టెంబర్ 04వ తేదీన జరిగే కెఆర్‌ఎంబీ తదుపరి సమావేశంలోనూ రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల విషయంలో రాజీ పడకుండా తమ వాదనలు వినిపించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించినట్లు సమాచారం. ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాపాతం లోటును దృష్టిలో ఉంచుకొని తాగు, సాగునీటి విషయంలో రాజీ పడొద్దని మనకు దక్కాల్సిన నీటి వాటాలను మనం రాబట్టుకునేలా వాదనలు ఉండాలని సిఎం అధికారులకు దిశానిర్ధేశం చేసినట్టుగా తెలిసింది. మహారాష్ట్రతో తుమ్మిడిహట్టి అంతరాష్ట్ర సమస్యకు పరిష్కారం చూపే దిశగా సెప్టెంబర్ 07వ తేదీన సీడ్లూసీ నేతృత్వంలో ఎపి తెలంగాణ జలా వివాదాలపై కీలక భేటీ జరుగనుంది. కృష్ణా జలాల వాటా, నీటి విడుదలపై ఎపి తెలంగాణ మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే కృష్ణా ప్రాజెక్టుల నిర్వహణ, నీటి పంపకాలపై కెఆర్‌ఎంబీ పరిధిలో పెండింగ్ అంశాలపై సిఎం అధికారులతో చర్చించినట్టుగా తెలిసింది. దీంతోపాటు గోదావరి జలాల వినియోగం, ప్రాజెక్టులు అనుమతులకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలపై చర్చించినట్టుగా సమాచారం.