మనతెలంగాణ/హైదరాబాద్:పేదలు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు 5 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలోనే ఇందిరమ్మ ఇళ్లను నిర్మించే విధంగా నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని స్థలాలను గుర్తించి తగిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఆనాటి ప్రభుత్వం నగరానికి 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించి హైదరాబాద్‌లో నివసిస్తున్న వారికి కేటాయించడం వల్ల తమ జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశ్యంతో ఇళ్లు తీసుకున్న లబ్ధిదారులు అక్కడ నివసించడానికి సంసిద్ధతం వ్యక్తం చేయడం లేదని క్షేత్ర స్థాయి పరిశీలనల్లో స్పష్టమైందని మంత్రి పొంగులేటి తెలిపారు.

రెవెన్యూ, హౌసింగ్ అంశాలపై జిల్లాల వారీగా మంగళవారం హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో మంత్రి పొంగులేటి సమీక్ష సమావేశాన్ని ని ర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతను రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం (జూన్ 02వ తేదీన) లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. మొదటి విడత ఇందిర మ్మ ఇళ్ల నిర్మాణం కొలిక్కి వచ్చిన నేపథ్యంలో సిఎం ఎ.రేవం త్ రెడ్డి సూచన మేరకు జూన్ 2 వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలో సెకండ్ ఫేజ్ ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇం దుకు సంబంధించిన విధి, విధానాలపై ఈ నెల 21వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొంగులేటి తెలిపారు.

డబుల్ బెడ్‌రూం ఇళ్లపై స్పెషల్ డ్రైవ్

డబుల్ బెడ్‌రూం ఇళ్లకు లబ్ధిదారులను కేటాయించడానికి యుద్ధప్రాతిపదికన స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని పొంగులేటి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పూర్తి అయిన వాటికి, వివిధ నిర్మాణ దశల్లో ఉన్న వాటికి ఈ నెలాఖరు కల్లా లబ్ధిదారులను గుర్తించాలని, అది కూడా ఆ కాలనీలకు అయిదు నుంచి ఎనిమిది కిలోమీటర్ల లోపు ఉన్న వారినే ఎంపిక చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే నిర్మాణాలన్నీ పూర్తైన ఇళ్లలో లబ్ధిదారులు ఉండేలా చూసేలా నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. ఈ కాలనీల్లో మంచినీరు, డ్రైనేజీ, విద్యుత్ వంటి కనీస సౌకర్యాల కల్పనకు వేగవంతమైన చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ పరిధిలో ఇళ్ల్ల స్థలాలు ఉండి అర్హులైన లబ్ధిదారులకు ఈనెల చివరిలోగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.

అంగుళం అన్యాక్రాంతమైనా సహించేది లేదు

అంగుళం ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైనా కఠినంగా వ్యవహారిస్తామని మంత్రి పొంగులేటి హెచ్చరించారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో యూఎల్సీ భూములు కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ, నిబంధనలకు విరుద్దంగా కొంత భాగాన్ని రిజిస్ట్రేషన్ చేశారని, స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సమావేశంలో మంత్రి దృష్టికి తీసుకు రాగా వెంటనే సంబంధిత సబ్ రిజిస్ట్రార్ పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.