
జూన్‌లో సనత్‌నగర్ టిమ్స్‌ను ప్రారంభిస్తామని ఆరోగ్య శాఖ దామోదర రాజనర్సింహ వెల్లడించారు. ఆసుపత్రిలో విజయవంతంగా వైద్య సేవల ట్రయల్ రన్ జరుగుతోందని అన్నారు. సనత్‌నగర్ టిమ్స్‌లో జరుగుతున్న వైద్య సేవల ట్రయల్ రన్‌ను మంగళవారం మంత్రి దామోదర్ రాజనర్సింహ పరిశీలించారు. హాస్పిటల్ ఎ,బి,సి బ్లాకులన్నీ మంత్రి కలియ తిరిగారు. ఓపీ రిజిస్ట్రేషన్, ఐపీ వార్డులు, ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్, సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ, ల్యాబ్‌లు, మెకనైజ్డ్ ల్యాండ్రీ, కిచెన్ తదితర అన్ని డిపార్ట్‌మెంట్లను మంత్రి పరిశీలించారు.ఆసుపత్రి ప్రారంభం నాటికి అన్ని సౌకర్యాలతో ఆసుపత్రిని సిద్ధం చేయాలని, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పని చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, పెండింగ్ పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ, ఆరోగ్యశాఖ అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు. సనత్‌నగర్ టిమ్స్ వెయ్యి పడకల ఆసుపత్రి అని, ఇందులో 300 ఎమర్జెన్సీ బెడ్లు ఉంటాయని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో బాధితుల ప్రాణాలు నిలిపే గొప్ప హాస్పిటల్‌గా దీనిని తీర్చిదిద్దుతున్నామని అన్నారు.
గుండె సంబంధిత వ్యాధుల చికిత్సలు, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలకు ఈ హాస్పిటల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఆసుపత్రిలో అద్భుతమైన రీసెర్చ్ సెంటర్ అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. రిసెప్షన్ ఏరియా, హెల్ప్ డెస్క్, ఒపి కౌంటర్లు, వెయిటింగ్ హాల్, ఓపీ కన్సల్టేషన్ రూమ్స్, డయాగ్నస్టిక్స్, ఇన్ పేషెంట్ వార్డులు, ఫార్మసీ తదితర ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి.. రిజిస్ట్రేషన్ కౌంటర్స్, ఫార్మసీ కౌంటర్స్ పెంచాలని సూచించారు. సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ, ఎక్స్ రే, ఆల్ట్రాసౌండ్ తదితర యంత్రాలను పరిశీలించారు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ యంత్రాలు పూర్తిస్థాయిలో పేషెంట్లకు ఉపయోగపడాలని, ఇందుకు అవసరమైన డాక్టర్లు, ఇతర సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలని ఆరోగ్యశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. హాస్పిటల్‌కు నీళ్లు, విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఆటంకం ఉండకూడదని, 24 గంటల సరఫరా ఉండాలని తెలిపారు. ఫైర్ సేఫ్టీ విషయంలో రాజీ ఉండకూడదని, అన్ని ఫ్లోర్లలో మరోసారి పూర్తిస్థాయి పరిశీలన చేయాలని అధికారులను ఆదేశించారు.














