మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్’ (విబిజిరామ్ జి చట్టం)ను అమల్లోకి తీసుకురానుంది. కొత్త చట్టం వచ్చే జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుందని కేంద్ర ప్రభుత్వం సోమవాంరనాడు ప్రకటించింది. ఈ కొత్త చట్టం ద్వారా గ్రామీణ కుటుంబాలకు సంవత్సరానికి 125 రోజుల ఉపాధి హామీ లభిస్తుంది. ప్రస్తుతం ఎంజీనరేగా ద్వారా 100 రోజుల ఉపాధి మాత్రమే లభిస్తోంది. గ్రామీణ కార్మికులకు ఉపాధి అవకాశాలను మరింత పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది.

2005 నుంచి అమల్లో ఉన్న ఎంజీనరేగా పథకాన్ని అధికారికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎంజీనరేగా నుంచి కొత్త చట్టంలోకి మార్పు సజావుగా జరుగుతుందని, కార్మికులకు ఎలాంటి అంతరాయమూ కలగదని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ హామీ ఇచ్చింది. కొత్త గ్రామీణ రోజ్‌గార్ గ్యారంటీ కార్డులు జారీ అయ్యేంత వరకు, ప్రస్తుతం ఉన్న ఇకెవైసి జాబ్ కార్డులే చెల్లుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. ఆ ప్రక్రియ పెండింగ్‌లో ఉన్నప్పటికీ వారికి ఉపాధి లభిస్తుందని, జాబ్ కార్డులు లేని కొత్త కార్మికులు గ్రామ పంచాయతీలో నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.